Year ender 2023: హైదరాబాద్లో పెరిగిన క్రైం రేట్; వార్షిక నేర నివేదిక ఇలా!!
హైదరాబాద్ లో ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే క్రైం రేటు పెరిగిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని పేర్కొన్న ఆయన హైదరాబాద్ కమిషనరేట్లో ఇయర్ ఎండింగ్ మీడియా సమావేశాన్ని నిర్వహించి సంవత్సర క్రైమ్ నివేదికను వెల్లడించారు.
2023 సంవత్సరంలో నగరంలో నేరాలకు సంబంధించిన వివరాలను మహిళలపై రేప్ కేసులు 2022లో 343 కాగా, ఈ సంవత్సరం 403 నమోదైనట్టు గా పేర్కొన్నారు. మహిళలపై గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం 12 శాతం నేరాలు పెరిగినట్టుగా తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తొమ్మిది శాతం దోపిడీలు పెరిగాయని, ఈ ఏడాది 18 శాతం రేప్ కేసులు పెరిగాయని వెల్లడించారు.

మొత్తం హైదరాబాద్ పరిధిలో 24 వేల 821 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంవత్సరం హత్యలు 79, కిడ్నాప్ కేసులు 242, చీటింగ్ కేసులు 4,909 నమోదైనట్టు తెలిపారు. హత్యాయత్నాలు 262, దొంగతనం కేసులు 91 నమోదయ్యాయని, 2,637 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ 38 కోట్ల రూపాయలు కాగా, పోగొట్టుకున్న సొత్తు 75 శాతం రికవరీ జరిగిందన్నారు.
సైబర్ నేరాలు 11% పెరిగాయని, గతేడాది సైబర్ నేరాలలో 82 కోట్ల మోసాలు జరిగితే, 2023 లో 133 కోట్ల రూపాయల మోసాలు జరిగాయన్నారు. సైబర్ క్రైమ్స్ నేరాలలో పాల్గొన్న వారిని 650 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 2023 లో ఆర్థిక నేరాలపై 344 కేసులు పెట్టామని సి పి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయని తెలిపారు. ఇక ఈ సంవత్సరం 63% నేరస్తులకు శిక్షలు పడ్డాయని, 13 కేసులలో 13 మందికి జీవిత ఖైదు శిక్షలు పడ్డాయని, 83 డ్రగ్స్ కేసులలో 251 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. పిడి యాక్ట్ కింద 18 మందిపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.












Click it and Unblock the Notifications