స్నేహం పేరిట మోసం.. నగ్నచిత్రాలు, వీడియోలు పోస్ట్.. పోకిరి అరెస్ట్
హైదరాబాద్ : సోషల్ మీడియా రాజ్యమేలుతున్న తరుణంలో మంచికంటే చెడు ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. టెక్నాలజీ అందిపుచ్చుకుని సన్మార్గంలో నడవాల్సిందిపోయి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఈక్రమంలో స్నేహం పేరిట ఒక అమ్మాయిని వేధిస్తున్న పోకిరోడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేయడమే గాకుండా నగ్న చిత్రాలు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
పాతబస్తీకి చెందిన 22 సంవత్సరాల మొయిజుద్దీన్ కొంతకాలం కిందట ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. స్నేహం పేరిట వీరిద్దరు తరచుగా ఫోన్ లో మాట్లాడుకున్నారు.
అదలావుంటే ఇటీవల ఆ అమ్మాయి ఫేస్బుక్ పేజీలో తనకు సంబంధించినట్లుగా ఉన్న అసభ్యకరమైన వీడియోలు చూసి కంగుతింది. ఇదంతా మొయిజుద్దీన్ చేశాడనే అనుమానంతో అతడికి కాల్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడట. అవే కాదు ఇంకా చాలానే ఉన్నాయంటూ బెదిరించాడట. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించింది. వెంటనే వారు ఆమెకు సంబంధించినట్లుగా చెబుతున్న ఫేస్బుక్ పేజీలను బ్లాక్ చేయించారు. ఆ తర్వాత మొయిజుద్దీన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.