పెద్ద సారు అలా.. చిన్న సారు ఇలా... కేసీఆర్, కేటీఆర్‌పై షర్మిల నిప్పులు
సందు దొరికితే చాలు వైఎస్ షర్మిల రెచ్చిపోతున్నారు. సీఎం కేసీఆర్‌ను ఏకీపారేస్తున్నారు. ఈ సారి మంత్రి కేటీఆర్ కూడా చూడలేదు. తనదైన శైలిలో విమర్శలు చేశారు. కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంటే పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారని ఫైరయ్యారు. ప్రజల కష్ట సుఖాలు పట్టవా అని షర్మిల రెచ్చిపోయారు. ఈ మేరకు వరస ట్వీట్లు చేశారు.
ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మరోసారి ఘాటు విమర్శలు చేశారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు, కేసీఆర్ కళ్లు, చెవులు మూసుకొని పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. చిన్న సారు కేటీఆర్‌కు కరోనా కష్టాలు అసలే కనపడవు అంటూ చురకలు అంటించారు. రెమిడేసివిర్ కోసం జనం చాంతాడంత క్యూలు కడుతున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదని, 3500 ఇంజక్షన్ 40 వేలకు కొంటున్నామని జనం మొత్తుకుంటున్నా, ప్రభుత్వానికి వినిపించడం లేదని మండిపడ్డారు.

అంతేకాదు ఆక్సిజన్ లేక కరోనా రోగులు చస్తుంటే తనకేమీ పట్టనట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తండ్రీ కొడుకులు తమ గారడి మాటలను పక్కన పెట్టి, మౌలిక సదుపాయాలపై దృష్టిసారించాలని షర్మిల హితవు పలికారు. లాక్ డౌన్ కూడ సరయిన సమయంలో విధించలేదని.. కేసులు పెరిగాక విధించడంలో అర్థం ఏముందని అభిప్రాయపడ్డారు. ఇంటికి ఒకటి చొప్పున కేసులు ఉన్నాయని.. నెల ముందు విధిస్తే సరయిన ఫలితం వచ్చేదని చెప్పారు.












Click it and Unblock the Notifications