రాజ్యాంగం లేనిదే సీఎం అయ్యావా? కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ నేతల ఫైర్
కేసీఆర్ చేసిన రాజ్యాంగం కామెంట్ల దుమారం కొనసాగుతోంది. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని సీఎం కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటని వైఎస్ఆర్ టీపీ నేతలు అంటున్నారు. యావత్ దేశ ప్రజలకు ఆయనక్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో నేతలు క్షీరాభిషేకం చేశారు.

తక్కువ చేసి మాట్లాడటం..
రాజ్యాంగాన్ని మార్చాలని అవహేళన చేసిన సీఎం కేసీఆర్.. ముక్కు నేలకు రాసి, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. తలపొగరుతో తలతిక్క మాటలు మాట్లాడుతున్న కేసీఆర్‌కు ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో కేసీఆర్ ఆలోచించుకోవాలని కోరారు. 72 ఏళ్ల భారతావనిలో ఏ ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పలేదని, అంత గొప్ప రాజ్యాంగాన్ని కేసీఆర్ లాంటి నియంత.. మార్చాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. మొదటి నుంచి దళితులంటే కేసీఆర్‌కు చిన్నచూపేనని తెలిపారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, దళితులకు కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం లేదన్నారు.

మోసం.. వంచన
దళితులను మరోసారి మోసం చేసేందుకు దళిత బంధు ప్రవేశపెట్టారని విమర్శించారు. దళిత ముద్దుబిడ్డ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పడం దళితుల పట్ల ఆయనకు ఉన్న వివక్ష తెలియజేస్తుందన్నారు. ప్రపంచ దేశాలు కొనియాడే రాజ్యాంగాన్ని.. కేసీఆర్ మార్చాలని చెప్పడం ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనమ్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నిలువెళ్లా విషమే నింపుకొన్నాడని, రాష్ట్ర ప్రజలను హింసించిందే కాక ఇప్పుడు దేశ ప్రజలను హింసించే విధంగా చేస్తున్నారని పేర్కొన్నారు.
Recommended Video

సిగ్గుచేటు
కేసీఆర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతూ.. కొత్త రాజ్యాంగాన్ని తేవాలని చెప్పడం దొంగే దొంగకు మద్దతు ఇచ్చినట్లుగా ఉందన్నారు. మరోసారి కొత్త రాజ్యాంగ విషయాన్ని లేవనెత్తితో ప్రజలు ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ పిచ్చి వానిలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, కేసీఆర్ నే మార్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్, పార్టీ లీడర్లు సత్యవతి, భూమిరెడ్డి, అయూబ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications