మోడీ జేబులోనే జగన్, కేసీఆర్, బాబు-నమ్మని జాతీయ విపక్షాలు-స్వార్ధ నేతల్ని దూరంపెట్టేశారా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలు మరోసారి జట్టు కడుతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే చేతిలో చావుదెబ్బతిన్న విపక్షాలు.. మోడీకి ఎట్టిపరిస్ధితుల్లో హ్యాట్రిక్ అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో ఉన్నాయి. ఈ పోరులో ఏ చిన్న రిస్క్ తీసుకునేందుకు అవి సిద్ధంగా లేవు. దీంతో మోడీపై పోరు కోసం తాజాగా జట్టు కట్టిన 13 విపక్షాలు.. ఈ కూటమిలో తెలుగు రాష్ట్రాల నేతలెవరికీ చోటివ్వకపోవడం చర్చనీయాశంగా మారుతోంది.

మోడీపై విపక్షాల పోరు
జాతీయస్ధాయిలో ప్రధాని మోడీపై పోరు కోసం విపక్షాలు మరోసారి ఏకమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న రాజకీయ క్షుద్రప్రయోగాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న టీఎంసీ, శివసేన, డీఎంకే, ఆప్ వంటి విపక్షాలు ఇప్పుడు జాతీయస్ధాయిలోనూ మోడీని దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో ఈ లోపే విపక్షాల తరఫు బలమైన కూటమి ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఇందులో ఇప్పటికే ప్రాంతీయంగా సత్తా చాటుతున్న పార్టీల నేతలతో పాటు మోడీకి వ్యతిరేకంగా పోరాడే సత్తా ఉన్న వారందరికీ కలుపుకుపోతున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల నేతలు మాత్రం లేరు.

తెలుగు నేతలకు దక్కని చోటు
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్, కేసీఆర్... తమ తమ రాష్ట్రాల్లో బలీయశక్తులుగా ఉన్నారు. కేసీఆర్ వరుసగా రెండుసార్లు అధికారం అందుకుని హ్యాట్రిక్ వైపు అడుగులేస్తుండగా..జగన్ తొలసారి అధికారం చేపట్టినా విపక్షాలను కకావికలు చేసి ఏపీలో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారు. వీరిద్దరితో పాటు రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా చెప్పుకునే చంద్రబాబు కూడా మరోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలకు జాతీయస్ధాయిలో విపక్షాలు రూపొందిస్తున్న కూటమిలో మాత్రం స్ధానం దక్కలేదు.

జగన్, కేసీఆర్, బాబును నమ్మని వైనం
సొంత రాష్ట్రాల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండటమో, ప్రాంతీయంగా బలీయంగా ఉండటమో ఇలా ఏదో ఒక రూపంలో సత్తా చాటుకున్న జగన్, కేసీఆర్, చంద్రబాబును జాతీయస్ధాయిలో విపక్షాలు మాత్రం నమ్మడం లేదు. దీనికి ప్రధాన కారణం మోడీ వ్యతిరేక పోరులో వీరి చంచల ధోరణే. జగన్, చంద్రబాబు అయితే మోడీకి వ్యతిరేకంగా పోరాటానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. కేసీఆర్ అయితే ప్రస్తుతానికి తన అవసరాల కోసం మోడీపై పోరు ఉధృతం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మరోసారి గెలిస్తే మాత్రం మోడీపై పోరును పక్కనబెట్టే అవకాశాలు లేకపోలేదు. దీంతో మోడీపై స్ధిరంగా పోరాడేందుకు సిద్ధంగా లేని ఈ ముగ్గురు నేతల్ని విపక్షాలు దూరంగా ఉంచుతున్నాయి.

స్వార్ధమే ముంచుతోందా?
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ తో పాటు మాజీ సీఎం చంద్రబాబును సైతం విపక్షాలు పక్కనబెట్టేస్తున్న నేపథ్యంలో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ముగ్గురినీ జాతీయ స్ధాయిలో విపక్షాలు తమతో కలుపుకోకపోవడం వెనుక వీరి స్వార్ధమే కారణంగా కనిపిస్తోంది.
జాతీయ ప్రయోజనాలతో పోలిస్తదే తమ ప్రయోజనాల కోసమే చూసుకుంటున్న వీరిని నమ్మలేమన్న భావన వారిలో కనిపిస్తోంది. ఉదాహరణకు జగన్ తనపై సీబీఐ కేసులున్నంతవరకూ మోడీని వ్యతిరేకించలేరని తేలిపోయింది. అలాగే చంద్రబాబు కూడా ఓటుకు నోటు వంటి కేసులు పూర్తిగా మాఫీ అయ్యే వరకూ అదే పరిస్ధితుల్లో ఉంటారు.
ఇక మిగిలిన కేసీఆర్ సైతం తెలంగాణలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురుకాకపోతే జాతీయస్దాయిలో మోడీపై పోరు సలిపే పరిస్ధితి లేదు. దీంతో వీరి స్వార్ధ ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలు వీరికి అవసరం లేదనే భావన విపక్షాల్లో కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications