ఉగ్రవాదులను విచారిస్తున్న ఎన్ఐఏ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలపై అరెస్టు అయిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థకు చెందిన 14 మంది ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
నిందితులు అందరిని సోమవారం ఢిల్లీలోని పటియాలా కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో 14 మందిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి పలు ఆసక్తికరమైన వివరాలు సేకరిస్తున్నామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థ చీఫ్ ముదబిర్ ముస్తాక్, అబు అన్స్, మహమ్మద్ నఫీజ్ ఖాన్, మహమ్మద్ ఒబేదుల్లా ఖాన్, షరీఫ్ మెయినుద్దీన్ ఖాన్, నజ్మల్ హూడా, మహమ్మద్ అఫ్జల్, సయ్యద్ ముజాహిద్, మహమ్మద్ ఆలీం, ఆసీఫ్ ఆలీ, సోహైల్ మహమ్మద్, మహమ్మద్ అబ్దుల్ అహద్, మహమ్మద్ హుస్సేన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ లను ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు.

న్యూఢిల్లీకి చెందిన ఎన్ఐఏ ఎస్పీ అనురాగ్ కుమార్, డీఎస్పీ ఆర్ఎస్. జంవాల్ తదితరులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు దాడులకు ముందే నిందితుల ఇండ్లలో సోదాలు చెయ్యడానికి ఢిల్లీలోని పాటియాలా కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు తీసుకున్నారు.
ముంబైలో అరెస్టు అయిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సంస్థ చీఫ్ ముదబిర్ ముస్తాక్ ఆదేశాల మేరకే దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చెయ్యాలని వీరు ప్లాన్ వేశారని ఉగ్రవాదులను విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications