• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1971 ఇండో-పాక్ వార్: యుద్ధంలో గాయపడి తన చేతులతోనే తన కాలు నరికేసుకున్న భారత మేజర్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఇది 1971 డిసెంబరు 7న జరిగింది. అతగ్రామ్, ఘాజీపుర్‌లలో పాకిస్తాన్ బలగాలను మట్టికరిపించిన అనంతరం, భారత సైన్యంలోని '5 గూర్ఖా రైఫిల్స్'కు చెందిన 4వ బెటాలియన్‌కు నాలుగు రోజుల విశ్రాంతి ఇచ్చారు.

దీంతో దగ్గర్లోని ఓ సరస్సులో భారత సైనికులు స్నానాలు చేశారు. తమ బట్టలను ఎండలో ఆరబెట్టుకుని అంతా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడే లెఫ్టినెంట్ కల్నల్ హరోలికర్‌కు బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఫోన్ వచ్చింది.

ఈ బెటాలియన్‌కు మరో పని అప్పగిస్తున్నామని, వెంటనే ఆ పని మీద బయల్దేరాలని ఫోన్‌లో చెప్పారు.

''నాలుగు రోజుల నుంచి సైనికులు నిద్రలేకుండా పోరాడారు. ఇప్పుడు వారంతా బాగా అలసిపోయారు. వారికి విశ్రాంతి అవసరం''అని అడ్డుచెప్పేందుకు హరోలికర్ ప్రయత్నించారు.

''ఇప్పుడు అంత సమయం లేదు. వెంటనే వెళ్లాలి. అయినా, ఈ విషయం నాకు పై అధికారులు చెప్పినప్పుడు నేను కూడా వద్దనే అన్నాను. కానీ, ఎవరూ వినిపించుకోలేదు. వెంటనే వెళ్లాల్సుంటుంది"'అని బ్రిగేడ్ కమాండర్ బంటీ క్విన్ ఫోన్‌లో చెప్పారు.

సిల్హట్‌లో అడుగుపెట్టగానే దాడి..

ఢాకాను కాపాడుకునేందుకు పాకిస్తాన్ '202 ఇన్ఫాంటరీ బ్రిగేడ్' జవాన్లు అంతకు ముందే సిల్హట్ నుంచి వెళ్లిపోయారని భారత సైనిక కమాండర్ జనరల్ సగత్ సింగ్‌కు సమాచారం అందింది. సిల్హట్‌లో 200 నుంచి 300 మంది జవాన్లు మాత్రమే ఉన్నారని వారికి చెప్పారు.

తమ దగ్గరున్న 10 హెలికాప్టర్లలో గూర్ఖా సైనికులందరినీ సిల్హట్‌లో దింపుదామని సగత్ సింగ్ ప్రణాళికలు వేశారు. వారి సాయంతో సిల్హట్‌ను వెంటనే తమ అదుపులోకి తీసుకోవచ్చని భావించారు. ఇది ''హెలీబోర్న్ ఆపరేషన్''అని ఉదయం 7.30కి గూర్ఖా బెటాలియన్‌కు సమాచారం వచ్చింది.

ఉదయం 9.30 కల్లా గూర్ఖా బెటాలియన్ సన్నహక కార్యక్రమాలు నిర్వహించింది. మధ్యాహ్నం 2.30కు ఆపరేషన్ మొదలైంది. గూర్ఖా సైనికుల్ని తీసుకెళ్లేందుకు కలౌరాకు ఏడు 'ఎంఐ 4' హెలికాప్టర్లు వచ్చాయి.

ఇటీవల ప్రచురితమైన '1971, స్టోరీస్ ఆఫ్ గ్లిట్ అండ్ గ్లోరీ, ఫ్రమ్ ద ఇండో-పాక్ వార్' పుస్తకంలో మేజర్ జనరల్ ఇయాన్ కార్డోజో ఆనాటి విషయాలు వెల్లడించారు.

'హెలిబోర్న్ ఆపరేషన్లలో పాల్గొనడానికి గూర్ఖా సైనికులకు ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు. పైగా వారికి హెలికాప్టర్లలో ఇలా తీసుకెళ్లడం అదే తొలిసారి. మేజర్ మణి మలిక్ నేతృత్వంలోని తొలి సైనికుల బృందం మధ్యాహ్నం 3.30కు సిల్హట్ చేరుకుంది. భారత సైనికులు నేలపై అడుగుపెడుతుండగానే, వారిపై పాక్ సైనికుల దాడి మొదలైంది. 'అల్లాహో అక్బర్' అంటూ పాక్ సైనికులు హెలికాప్టర్లపై దాడి మొదలెట్టారు.''

''మొదట అక్కడ దిగే సైనికుల కోసం తీసుకొచ్చిన రేడియో సెట్‌ను ఇంకా సిద్ధం చేయలేదు. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతోందో మా బ్రిగేడ్ కమాండర్‌కు చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది'' అని కార్డోజో అందులో చెప్పారు.

దీటుగా ప్రతిదాడి

అక్కడ జరిగిన దాడికి సంబంధించిన వివరాలు అర్జున్ సుబ్రమణియన్ పుస్తకం 'ఇండియాస్ వార్స్ 1947-1971'లోనూ కనిపిస్తాయి.

''ఎంఐ హెలికాప్టర్లలో మొదటగా సిల్హట్‌లో దిగిన సైనికుల్లో నేనూ ఒకణ్ని. మాతో 70-80 మంది గూర్ఖా సైనికులు ఉన్నారు. హెలికాప్టర్ శబ్దం చాలా ఎక్కువగా ఉండటంతో, అక్కడ అసలు ఏం జరుగుతుందో మాకు అర్థంకాలేదు'' అని వింగ్ కమాండర్ ఎస్సీ శర్మ తనకు చెప్పినట్లు అందులో సుబ్రమణియన్ వివరించారు.

''మేం ఐదు అడుగుల ఎత్తు నుంచే కిందకు దూకాం. దూకుతూనే మాపై కాల్పులు మొదలయ్యాయి. దీంతో అందరూ నేలపై ఒరిగిపోవాలని లెఫ్టినెంట్ కల్నల్ హరోలికర్ సూచించారు. దాంతో గూర్ఖాలంతా నేలపైకి ఒరిగిపోయాం. కాసేపటి తర్వాత, మేం కూడా ప్రతి కాల్పులు జరపడం మొదలుపెట్టాం. 'జై కాళీ మా ఆయో గూర్ఖాలీ' అంటూ కాల్పులు జరిపాం. దీంతో పారిపోయిన పాక్ సైనికులు 400 మీటర్లు దూరంలోని ఓ గ్రామంలో దాక్కున్నారు'' అన్నారు.

అది తప్పుడు సమాచారం..

202 పాకిస్తానీ బ్రిగేడ్ సిల్హట్ నుంచి ఢాకా వెళ్లిపోయిందని తమకు అందిన సమాచారం తప్పని జనరల్ సగత్ సింగ్‌కు అప్పుడు అర్థమైంది. మరోవైపు పాకిస్తాన్‌కు చెందిన 313 బ్రిగేడ్‌ను కూడా ఢాకాకు పంపకుండా సిల్హట్‌కే తరలించారు.

దీంతో గూర్ఖా సైనికులు సిల్హట్‌లో కాలు మోపిన వెంటనే, పాకిస్తాన్‌కు చెందిన రెండు బ్రిగేడ్ల సైనికులు దాడి మొదలుపెట్టారు. అక్కడ మొత్తంగా దాదాపు 8 వేల మంది పాక్ సైనికులు ఉన్నారు.

ఆ మరుసటి రోజు హెలికాప్టర్లు మరికొంత మంది గూర్ఖా సైనికులను కూడా తీసుకొచ్చాయి. అయితే, అది భారత సైన్యానికి చెందిన రెండో బెటాలియన్ అని పాక్ సైనికులు భావించారు.

ఆనాటి సంగతులను పీవీఎస్ జగన్మోహన్, సమీర్ చోప్రా తమ ''ఈగల్స్ ఓవర్ బంగ్లాదేశ్'' పుస్తకంలో వివరించారు.

''భారత వైమానిక దళానికి చెందిన మరిన్ని హెలికాప్టర్లు గూర్ఖా సైనికులతో దిగడంతో సిల్హట్‌లోని పాకిస్తానీ బ్రిగేడ్ కమాండర్ గందరగోళానికి గురయ్యారు.''

''గూర్ఖాలకు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాదని జనరల్ సగత్ సింగ్ భావించారు. అయితే, పరిస్థితులు దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. గూర్ఖా సైనికులు దిగిన ప్రాంతంలో పాక్ సైనికులను భారీగా మోహరించి ఉన్నారు.''

ఆహారం, నీళ్లు అయిపోతున్నాయి...

సిల్హట్‌లో దిగిన మొత్తం గూర్ఖా సైనికుల సంఖ్య 384 మాత్రమే. ఆ సంఖ్య పాకిస్తాన్ సైనికులకు తెలిసిపోతుందేమోనని భారత కమాండర్లకు ఆందోళనగా ఉంది.

డిసెంబరు 9 రాత్రి నాటికి గూర్ఖా సైనికులు అక్కడదిగి 48 గంటలకుపైనే అయ్యింది. అయితే, వారికి కావాల్సిన సరుకులు, వస్తువులు మాత్రం ఇంకా అందలేదు.

వారికి అందుబాటులో ఉన్న ఆహారం, నీరు క్రమంగా అయిపోతూ వచ్చింది. మరోవైపు పాక్ సైనికుల దాడుల్లో చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూపోయింది. గూర్ఖా జవాన్లు స్థానికులు ఇళ్లలో వదిలివెళ్లిన ఆహారంపైనే ఆధారపడేవారు.

మరోవైపు దప్పిక తీర్చుకోడానికి మురికినీళ్లతో నిండిన గుంటలే ఆధారమయ్యాయి. వాళ్లు ఆ నీటిని చేతి రుమాలుతో వడకట్టుకొని తాగేవారు.

అయితే, బీబీసీ నుంచి భారత్‌కు ఒక ఊహంచని సాయం అందింది.

బీబీసీ తప్పిదంతో భారత్‌కు మేలు

అక్కడ అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజేయడానికి భారత సైన్యం తమతో కొందరు విదేశీ జర్నలిస్టులను తీసుకెళ్లింది.

''అప్పట్లో ప్రధానంగా మూడు వైపుల నుంచి వార్తలు అందేవి. వీటిలో మొదటిది ఆల్ ఇండియా రేడియో. అయితే, దానిలో ప్రసారం చేసే వార్తలకు సైనిక ప్రధాన కార్యాలయం నుంచి అనుమతి రావాల్సి ఉండేది. దీంతో వార్తలు కాస్త ఆలస్యం అయ్యేవి. రెండోది రేడియో పాకిస్తాన్. దాన్ని రేడియో ఝూటిస్తాన్ అనేవారు. ఎందుకంటే దాన్లో ఎక్కువగా అసత్యాలు చెప్పేవారు. మూడోది బీబీసీ. ఆ సంస్థపై ప్రజలకు మంచి నమ్మకం ఉండేది''అని జనరల్ కార్డోజో తెలిపారు.

''సిల్హట్‌లో భారత్ బ్రిగేడ్ కాలుమోపింది" అని బీబీసీ వార్ కరస్పాండెంట్ రేడియో బులిటెన్‌లో తప్పుగా చదివారు. ఆ వార్తలు ప్రసారమయ్యే సమయానికి భారత్, పాక్ జవాన్లు ఎదురెదురుగా ఉన్నారు. బీబీసీ రేడియో వింటున్నారు.

''బీబీసీ వాళ్లు ఏం చెప్పారో విన్నావా?అని హరోలికర్ నన్ను అడిగారు. బీబీసీ లాంటి పెద్ద సంస్థ ఇలాంటి తప్పు ఎలా చేసింది. వింతగా ఉందే అని మరో అధికారి అన్నాడు. నేను వెంటనే బీబీసీ తప్పు చెప్పలేదు సర్.. వాళ్లు సరిగ్గానే చెప్పారు. పాకిస్తాన్ సైన్యం కూడా ఈ వార్త వినే ఉంటుంది. ఇప్పుడు వాళ్లకు మనం నిజంగానే ఒక పెద్ద బ్రిగేడ్ అనిపించేలా చేయాలి''అని కార్డోజో అన్నారు.

బెటాలియన్‌ను అక్కడక్కడా మొహరించారు

"మా సీఓ, నేను కలిసి మా బెటాలియన్‌ను ఒక పెద్ద ప్రాంతమంతా చెదరగొట్టాం.. ఖాళీల్లో కొంతమంది సైనికులను ఆటోమేటిక్ ఆయుధాలతో మోహరించాం. అలా పెట్రోలింగ్ చేస్తున్న పాకిస్తాన్‌కు అది భారత బెటాలియన్ కాదు, ఒక మొత్తం బ్రిగేడ్ అనిపించేలా చేయాలనుకున్నాం" అని జనరల్ కార్డోజో చెప్పారు.

గూర్ఖా సైనికుల్లోని ఒక ప్లటూన్‌కు ఎత్తుగా ఉన్న ఒక గుట్టను స్వాధీనం చేసుకోమని చెప్పారు. ఎందుకంటే అది పాకిస్తాన్ సైనికుల అధీనంలోకి వెళ్లిపోతే, భారత సైనికుల సంఖ్య ఎంత ఉందనే అసలు విషయం వారికి స్పష్టంగా తెలిసిపోతుంది.

దాదాపు, అదే సమయంలో పాకిస్తాన్ కూడా అక్కడికి చేరుకునే ప్లాన్ వేస్తోంది. కానీ గూర్ఖా జవాన్లు వాళ్లకంటే ముందే అక్కడికి చేరుకుని ఎత్తు నుంచి ఫైరింగ్ చేస్తూ వారిని అడ్డుకున్నారు.

ఖుఖ్రీలకు పదును పెట్టిన గూర్ఖా సైనికులు

అక్కడ పాకిస్తాన్ సైన్యం అంతా పెద్ద దాడికి గుమిగూడడం భారత జవాన్లను చూడగానే.. వాళ్లు ఎయిర్ సపోర్ట్ అడగడం, భారత వైమానిక దళం మిగ్-21, హంటర్స్ విమానం వచ్చి వాళ్ల మీద బాంబులు వేయడం జరిగిపోయింది.

రాత్రి భారత వైమానిక దళం హెలికాప్టర్ అక్కడ దిగినప్పుడు భారత్ అదనపు సైనికులను, ఆయుధాలను తీసుకొస్తున్నట్లు పాకిస్తాన్ సైనికులకు అనిపించేది, నిజానికి అవి గాయపడ్డవారిని తీసుకెళ్లడానికి వస్తుండేవి. గూర్ఖాలు అక్కడ యాక్టివ్‌గా ఆపకుండా దాడి చేయడం కొనసాగించారు. మరోవైపు గూర్ఖాల దగ్గర మందుగుండు అయిపోవడం మొదలైంది.

"మా సీవో సైనికుల స్థావరాల దగ్గరకు ఎప్పుడు వెళ్లినా, అక్కడ గూర్ఖాలు తమ ఖుఖ్రీలకు పదును పెట్టుకుంటుండడం ఆయనకు కనిపించేది. అలా ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు 'మా దగ్గర మందుగుండు అయిపోయిప్పుడు మేం మాకు అత్యంత నమ్మకమైన మా ఖుఖ్రీ ఆయుధాన్ని ఉపయోగిస్తాం' అని చెప్పేవారు."

తెల్ల జెండాతో పాకిస్తాన్ లొంగుబాటు ప్రతిపాదన

గూర్ఖా సైనికులు సిల్హట్ ఫ్రంట్ దగ్గర మొత్తం 8 రోజులు గడిపారు. 1971 డిసెంబర్ 15న ఉదయం 9 గంటలకు భారత సైన్యాధ్యక్షుడు శామ్ మానెక్ షా రేడియోలో పాకిస్తాన్ సైనికులు ఆయుధాలు అప్పగించి లొంగిపోవాలన్నారు. ఆయన ఆ ప్రకటన చేయగానే ఇద్దరు పాకిస్తాన్ అధికారులు తెల్ల జెండాలతో గూర్ఖా స్థానాలవైపు వైపు వెళ్లారు.

దాని గురించి కల్నల్ ఆర్డీ పల్‌సోకర్ తన 'ఫరెవర్ ఇన్ ఆపరేషన్‌' పుస్తకంలో రాశారు.

"4/5 గూర్ఖా సైనికుల ముందు తమ కమాండర్లు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు చెప్పడానికి వచ్చామని ఆ అధికారులు చెప్పారు. వాళ్లు రావడాన్ని 1500 మీటర్ల దూరం నుంచే చూసిన సీ కంపెనీ మేజర్ మలిక్ తమ కమాండింగ్ ఆఫీసర్‌కు ఒక మెసేజ్ పంపించి మాకు ఏం ఆదేశాలు ఇస్తారు" అని అడిగారు."

"లెఫ్టినెంట్ కల్నల్ హరోలికర్ ముందుకు వెళ్లి చూసినప్పుడు, వెయ్యి నుంచి 2 వేల మధ్య ఉన్న పాకిస్తాన్ సైనికులు ఒక మూలగా గుమిగూడి ఉన్నారు. అప్పటివరకూ లొంగిపోతారనే అధికారిక సూచన ఏదీ రాలేదు. అందుకే పాకిస్తాన్ సైనికులు అలా చెప్పడం గురించి సీఓకు అనుమానం వచ్చింది" అని తెలిపారు.

ఇయాన్ కార్డోజో

లొంగుబాటును తిరస్కరించిన భారత సైనికులు

భారత బ్రిగేడ్ కమాండర్ ఎదుట తమ మొత్తం గారిసన్ లొంగిపోవాలని అనుకుంటోందని గారిసన్ కమాండర్ నుంచి వచ్చిన ఒక నోట్‌ను పాకిస్తాన్ అధికారులు భారత సైనికులకు అందించారు.

"మా దగ్గర ఒక మొత్తం బ్రిగేడ్ ఉందని చూపించాలనుకున్న మా ఎత్తు ఫలించిందనే విషయం మా సీఓకు అర్థమైంది. కానీ, తమ ముందు సగం భారత్ బెటాలియనే ఉందనే విషయం పాకిస్తానీలకు అప్పుడు తెలిసిపోతే పరిస్థితులు తలకిందులు కావచ్చనే విషయం కూడా ఆయనకు తెలుసు" అని జనరల్ కార్డోజో చెప్పారు.

"మీరు తిరిగి వెళ్లండి, సరెండర్‌కు అనుమతించాలని మాకు ఇంకా ఆదేశాలు రాలేదు అని ఆయన పాకిస్తానీ అధికారులకు చెప్పారు. భారత బ్రిగేడ్ కమాండర్ అక్కడకు దాదాపు 100 మైళ్ల వెనక ఉన్నారు. దాంతో, వెంటనే వచ్చి పాకిస్తాన్ సైనికుల సరెండర్ తీసుకోవాలని ఆయనకు ఒక కోడెడ్ మెసేజ్ పంపించాం" అన్నారు.

హెలికాప్టర్‌లో దిగడం చూసి విస్తుపోయిన పాకిస్తాన్

డిసెంబర్ 15న మధ్యాహ్నం భారత బ్రిగేడ్ కమాండర్ బంటీ క్విన్ హెలికాప్టర్లో సిల్హట్ చేరుకున్నారు. మూడు గంటలకు పాకిస్తాన్ గారిసన్ కమాండర్ ఆయన్ను కలిశారు. తర్వాత రోజు ఉదయం అంటే డిసెంబర్ 16 మొత్తం సిల్హట్ గారిసన్ భారత సైనికుల ముందు లొంగిపోయింది.

బ్రిగేడియర్ బంటీ హెలికాప్టర్ నుంచి దిగడం చూసిన పాకిస్తానీలకు కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. తర్వాత తమ రెండు బ్రిగేడ్లను, భారత్‌కు చెందిన సగం బెటాలియన్‌ను ఎదుర్కుందనే విషయం తెలిసినప్పుడు వాళ్లు షాక్ అయ్యారు.

అప్పుడు మొత్తంగా ముగ్గురు పాకిస్తానీ బ్రిగేడియర్స్, 173 మంది అధికారులు, 290 మంది జేసీలు, 8 వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైనికుల ముందు లొంగిపోయారు. సరెండర్ అయిన పాకిస్తానీ బ్రిగేడియర్లు సలీముల్లా ఖాన్, ఇఫ్తికార్ రాణా, ఎస్ఏ హసన్.

ఈ బెటాలియన్ ఇక్కడ ఉండకపోతే మేం కనీసం మరో పది రోజులు సిల్హట్‌లోనే ఉండేవాళ్లం అని సరెండర్ తర్వాత పాకిస్తాన్ గారిసన్ కమాండర్ బ్రిగేడియర్ క్విన్ దగ్గర అంగీకరించారు.

అయితే, ఈ ఘటన 50 ఏళ్ల క్రితం జరిగింది. కానీ, బీబీసీ చారిత్రక తప్పిదానికి 5/4 గూర్ఖా బెటాలియన్ అధికారి, జవాన్లు దానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు. బీబీసీకి అది పెద్ద తప్పిదమే కావచ్చు, కానీ మా వరకు అది అత్యుత్తమ బులెటిన్" అని జనరల్ కార్డోజో అన్నారు.

ల్యాండ్‌మైన్ పేలడంతో ఛిద్రమైన కార్డోజో కాలు

ఈ యుద్ధంలో గూర్ఖా బెటాలియన్‌కు చెందిన నలుగురు అధికారులు, ముగ్గురు జేసీఓలు, 123 మంది జవాన్లు చనిపోయారు. పాకిస్తాన్ కాల్పుల్లో వారి రెజిమెంటల్ ఎయిడ్ పోస్ట్ కూడా ధ్వంసమైంది.

డిసెంబర్ 16న ఉదయం చాలా పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు సరెండర్ కోసం సిద్ధమవుతున్నప్పుడు చూసిన సరిహద్దు భద్రతా దళ కమాండర్ కంగారుపడిపోయారు.

ఎందుకంటే అక్కడ భారత సైనికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మేజర్ కార్డోజోను ఆయనకు సాయం కోసం పంపించారు.

అక్కడ పాకిస్తాన్ దళాలు పాతిపెట్టిన మందుపాతర మీద అడుగు పడడంతో కార్డోజో కాలు ఛిద్రమైంది. ఆయన కాలి నుంచి చాలా రక్తం కారుతోంది.

"నేను డాక్టర్‌తో నాకు కాస్త మార్ఫిన్ ఇవ్వండి అన్నాను. ఆయన ఆర్మీ ఆపరేషన్ సమయంలో కాల్పుల వల్ల మా దగ్గరున్న మందులన్నీ ధ్వంసమయ్యాయని చెప్పారు. అయితే, మీరు దీన్ని కట్ చేయగలరా అని నేను ఆయన్ను అడిగాను. ఆయన కట్ చేయడానికి తన దగ్గరే ఏవీ లేవని చెప్పారు".

"అప్పుడు నేను నా సహాయకుడితో 'నా ఖుఖ్రీ ఎక్కడ' అని అడిగా. ఖుఖ్రీ తెచ్చిన తర్వాత అతడితో నా కాలు కట్ చేయమని చెప్పా. అతడు 'సర్.. నా వల్ల కాదు' అన్నాడు. అప్పుడు నేను తన చేతుల్లోంచి ఖుఖ్రీ తీసుకుని నా చేతులతోనే నా కాలు కట్ చేశాను. తర్వాత దానిని తీసుకెళ్లి ఒక గొయ్యి తీసి పూడ్చిపెట్టు అని అతడిని ఆదేశించాను. బంగ్లాదేశ్‌లో ఒక చదరపు అడుగు స్థలంలో నా శరీర భాగం పాతిపెట్టి ఉందని ఇప్పటికీ అందరితో సరదాగా అంటుంటాను" అని కార్డోజో చెప్పారు.

ఆపరేషన్ చేసిన పాకిస్తాన్ సర్జన్

ఆ తర్వాత సీఓ వచ్చి ఆయనతో మీరు చాలా అదృష్టవంతులు అన్నారు. మన ముందు లొంగిపోయిన ఒక పాకిస్తాన్ సర్జన్ ఉన్నారు. ఆయన మీకు ఆపరేషన్ చేస్తారు అన్నారు.

కార్డోజో ఆ పాకిస్తాన్ సర్జన్‌తో ఆపరేషన్ చేయించుకోడానికి ఒప్పుకోలేదు. నన్ను ఎలాగోలా హెలికాప్టర్‌లో భారత్ పంపించేయండి అన్నారు.

అదే రోజు పాకిస్తాన్ సైన్యం ఢాకాలో లొంగిపోతుండడంతో ఆర్మీ దగ్గర హెలికాప్టర్లు అందుబాటులో లేవు. దాంతో, సీఓ మళ్లీ కార్డోజోతో "మీరు పాకిస్తాన్ సర్జన్‌తో ఆపరేషన్ చేయించుకోనంటూ చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు" అన్నారు.

కార్డోజో ఆ రోజును గుర్తు చేసుకున్నారు.

"నేను చాలా కష్టంగా ఆ ఆపరేషన్ కోసం ఒప్పుకున్నాను. కానీ నేను ఆయనకు రెండు షరతులు పెట్టాను. నంబర్ వన్.. నాకు పాకిస్తానీల రక్తం ఎక్కించకూడదు. రెండోది ఆపరేషన్ సమయంలో మీరు అక్కడే ఉండాలి. నా రెండు షరతులకూ ఆయన ఒప్పుకున్నారు. పాకిస్తాన్ సర్జన్ మేజర్ అహ్మద్ బషీర్ నాకు ఆపరేషన్ చేశారు. ఇది చదువుతుంటే.. ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. ఆయన చాలా మంచి పని చేశారు" అన్నారు.

కార్డోజో మొదట ఒడిశా చంద్రనగర్, తర్వాత పుణె వెళ్లారు. అక్కడ ఆయనకు కృత్రిమ కాలు అమర్చారు. ఆయన భారత సైన్యంలో మొదట ఒక బెటాలియన్, తర్వాత ఒక బ్రిగేడ్‌ను కమాండ్ చేసిన వికలాంగుడైన మొదటి అధికారిగా నిలిచారు. ఇయాన్ కార్డోజో భారత సైన్యంలో మేజర్ జనరల్‌గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
1971 Indo-Pak War: Indian Major wounded in battle and amputated his leg with his own hands
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X