కాలేజ్ యువతిపై డాక్టర్, పోలీసులు రేప్: వీడియో తీసి...
రాయపూర్: 22 ఏళ్ల కాలేజ్ యువతి పైన అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ వైద్యుడిని, ఇద్దరు పోలీసులను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గౌతమ్ పండిట్ అనే వైద్యుడు దుర్గ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు.
చంద్రప్రకాశ్ పాండే, సౌరభ్ భక్తా అనే ఇద్దరు కానిస్టేబుల్స్. యువతి పైన అత్యాచారం కేసులో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి యువతి, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత ఏడాది జూన్ 19వ తేదీన యువతికి ఓ ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆమెను దుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తన పైన వైద్యుడు, పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక కూడా ఇద్దరు కానిస్టేబుల్స్ సెక్స్ కోసం వేధించారు. ఆసుపత్రిలో అత్యాచారం చేసినప్పుడు తాము దానిని వీడియో తీశామని, తాము చెప్పినట్లు వినకుండా దానిని బయట పెడతామని బెదిరించారు.
మంగళవారం నాడు యువతి కాలేజీకి వెళ్తున్న సమయంలో.. అడ్డుకొని తమ వెంట తీసుకు వెళ్లారు. నగరంలో తిప్పారు. వారి వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో వారు పారిపోయారు.
అదే రోజు రాత్రి పదకొండు గంటలకు పవర్ హౌస్ క్రాసింగ్ వద్ద పోలీసులకు ఆమె కనిపించింది. ఆమెను వారు ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని ఆమె వారికి చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురి పైన కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications