ఇక ఇండీ కూటమి మద్దతిస్తేనే రాజ్యాంగ సవరణ..! మోడీ దూకుడుకు ఓటరు బ్రేక్..
దేశవ్యాప్తంగా ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు కేంద్రంలో ఎన్డీయే కూటమికి శరాఘాతంగా మారబోతోంది. పదేళ్లుగా విపక్షాల్ని లెక్కచేయకుండా చెలరేగిపోయిన ఎన్డీయే కూటమికి ముందరి కాళ్లకు ఓటరు కళ్లెం వేశాడు. ముఖ్యంగా ఏకపక్షంగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ వెళ్లిన మోడీ సర్కార్ ఈసారి మాత్రం విపక్షాల అనుమతి లేకుండా ఒక్క అడుగు వేయలేని పరిస్ధితి. దీంతో ఈ ఐదేళ్లూ మోడీ దూకుడుకు సహజంగానే కళ్లెం పడబోతోంది.
ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఓటర్లు 293 సీట్లు ఇస్తే.. విపక్ష ఇండీ కూటమికి 232 సీట్లు ఇచ్చారు. ఈ కీలక సమీకరణం ఎన్డీయే దూకుడుకు బ్రేక్ వేయబోతోంది. ఏదైనా అంశంపై రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. కానీ గతంలో బలంగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వం... విపక్షాలను లెక్కచేయకుండా ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసేసింది. ఇందులో తాజాగా తీసుకొచ్చిన మూడు క్రిమినల్ లా చట్టాలతో పాటు పలు సవరణలు ఉన్నాయి.

కానీ ఈసారి మాత్రం ఆ పప్పులు ఉడికే పరిస్ధితి లేకుండా ఓటరు తీర్పు ఇచ్చాడు. దీంతో 232 సీట్లు కలిగిన ఇండీ కూటమి మద్దతు లేకుండా ఒక్క రాజ్యాంగ సవరణ కూడా చేయలేని పరిస్ధితికి ఎన్డీయే చేరుకుంది. పేరుకు కేంద్రంలో ప్రభుత్వమే అయినా ఎన్డీయేకు భవిష్యత్తులో కీలక నిర్ణయాల విషయంలో విపక్షం అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రమాదం పొంచి ఉంది. గతంలో స్పీకర్లు, రాజ్యసభ ఛైర్మన్ల అండతో విపక్ష ఎంపీల్ని ఇష్టారాజ్యంగా సస్పెన్షన్లు చేసుకుంటూ వెళ్లిన మోడీ సర్కార్ కు ఆ విషయంలోనూ బ్రేక్ పడబోతోంది. ఇంత భారీ విపక్షాన్ని ముందు పెట్టుకుని ఎంపీల్ని ఇష్టారాజ్యంగా సస్పెన్షన్లు చేస్తే ప్రభుత్వ అప్రజాస్వామిక ధోరణి బయటపడుతుంది.












Click it and Unblock the Notifications