AstraZeneca వ్యాక్సిన్ 3వ డోసుతో మరింత బలం -2వ డోసు లేటైనా పర్వాలేదు -Oxford కీలక అధ్యయనం
రోజుకో తీరుగా మ్యూటేట్ అవుతూ, మరింతగా బలపడుతూ, కొత్త వేరియంట్లుగా మారుతోన్న కరోనా మహమ్మారి సుదీర్ఘ కాలంపాటు మానవాళిని ఇబ్బందిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ కీలక మార్పులు తథ్యంగా మారింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు రెండు డోసులవి కాగా, భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను సైతం ఎదుర్కొనేలా మనలో ఇమ్యూనిటీని ఇంకాస్త పెంచేలా మూడో డోసు కూడా అవసరమేనని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రధానంగా ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కు ఈ విధానం యాప్ట్ అవుతుందని వెల్లడైంది. అంతేకాదు, ఈ టీకా డోసుల మధ్య గ్యాప్ పెరగడం మచిదేననీ డాక్టర్లు అంటున్నారు. వివరాలివి..
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ మన దేశంలో కోవిషీల్డ్ పేరుతో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తుండటం తెలిసిందే. ఈ టీకా మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య 45 వారాల గడువుంటే మందు ఇంకా బాగా పనిచేస్తుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తెలిపింది. రెండో డోసు వేసుకున్న ఆరు నెలల తర్వాత మూడో డోసు వేసుకుంటే యాంటీబాడీస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వెల్లడించింది.

ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసుకు రెండో డోసుకు నడుమ 10 నెలల (315 రోజులు) తేడా ఉంటే.. అద్భుతమైన ఫలితం కనిపించిందని ఆక్స్ ఫర్డ్ పేర్కొంది. అయితే, ఈ అధ్యయనం ఇంకా ఏ సైన్స్ జర్నల్‌లోనూ ప్రచురితం కాలేదు. మొదటి డోసు వేసుకున్న పది నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి ఇమ్యూనిటీ పెరిగిందని, మూడో డోసును ఆలస్యం వల్ల కూడా పాజిటివ్ ఫలితాలు వచ్చినట్టు రిపోర్టులో తెలిపారు.
ఆక్స్ ఫర్డ్ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించడం, ఇప్పటికే కొన్ని దేశాల్లో టీకాను నిషేధించడం, ఇంకొన్ని ఆ నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. ఆస్ట్రా-ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ అర బిలియన్ మోతాదులను ఇప్పటికే 168 దేశాలకు పంపినట్లు పరిశోధకులు తెలిపారు. యూకేలోనే మొదటి డోసు ఆక్స్‌ఫర్డ్ టీకా వేసిన చాలా మందికి రెండో డోసు కింద ఫైజర్ వ్యాక్సిన్ అందించారు. ఫ్రాన్స్, ఇటలీ, కొన్ని స్కాండినేవియన్ దేశాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. తమ టీకా కోవిషీల్డ్ మూడో డోసు వేసుకుంటే మంచిదని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ పరిశోధకుడు ఆండ్రూ పొలార్డ్ ప్రకటించడం గమనార్హం.












Click it and Unblock the Notifications