పంబ వద్ద ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజూ వేలాదిమంది దర్శించుకుంటోన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయి. ఇటీవలే కొల్లం జిల్లా అంచల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు శబరిమల యాత్రికులతో వెళ్తున్న ఏపీకి చెందిన బస్సు అదుపు తప్పి అతి వేగంగా ఆటో రిక్షాను ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతి చెందిన ముగ్గురూ ఆటోరిక్షాలోనే ప్రయాణిస్తున్నవారే.
తాజాగా ఏపీకి చెందిన మరో బస్సు ప్రమాదానికి గురైంది. పథనంతిట్ట జిల్లా వడస్సేరిక్కార వద్ద బోల్తా పడింది. ఏపీ చిలకలూరిపేట నుంచి శబరిమలకు బయలుదేరిన మౌనిక టూర్స్ అండ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు అది. ఈ ఘటనలో నలుగురు శబరిమల యాత్రికులకు గాయాలయ్యాయి. వడస్సేరిక్కార వద్ద ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పింది బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఓ యాత్రీకుడి కాలు పూర్తిగా తెగింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 49 మంది అయ్యప్పస్వాములు ఉన్నారు. ఈ మధ్యకాలంలో వడస్సేరిక్కార-పంబ మార్గంలో సంభవించిన నాలుగో రోడ్డు ప్రమాదం ఇది. సోమవారం కొల్లం జిల్లా నిలమేల్ వద్ద శబరిమల యాత్రికుల కారు కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
తిరువనంతపురంలోని పూళప్పుర, పున్నముగల్‌కు చెందిన బిచు చంద్రన్, సతీష్, మరో వ్యక్తి అయ్యప్ప స్వామి దర్శనానంతరం తిరుగుముఖం పట్టిన సమయంలో వారు ప్రయాణిస్తోన్న కారు కొట్టారక్కర వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది వారిని వెంజమూడు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరు అక్కడే మృతి చెందారు.












Click it and Unblock the Notifications