Ayodhya: అయోధ్యలో మహాఘట్టానికి వేగంగా ఏర్పాట్లు- 400 మంది సాధువులు, ఆధ్యాత్మిక గురువులు..
ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ జిల్లాలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22న జరిగే ఈ మహాఘట్టానికి ప్రధాని మోడీతో పాటు పలువురు జాతీయ స్ధాయి ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరు కానుండగా.. వీరితో పాటు వివిధ వర్గాలకు చెందిన 400 మంది సాధువులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు ఆలయ ట్రస్ట్ ప్రకటించింది.
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామ్ లల్లా విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు పలు కార్యక్రమాల్ని ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది. వీటికి అన్ని సంప్రదాయాలకు చెందిన 400 మంది సాధువులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు ట్రస్ట్ తెలిపింది. వీరితో పాటు దేశ ప్రతిష్టను ఇనుమడింపచేస్తున్న పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపుతున్నట్లు వెల్లడించింది. అలాగే అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లను కూడా ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం ఆ ప్రాంతంలో తీర్ధక్షేత్రపురం నిర్మిస్తున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఇందులో ఆరు గొట్టపు బావులు, ఆరు వంటశాలలు, ఓ పది పడకల ఆస్పత్రి, అందులో 150 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. ఈ డాక్టర్లను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రప్పిస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది. అలాగే రామమందిరం ప్రారంభానికి వచ్చే లక్షలాది భక్తులకు భోజన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నట్లు వెల్లడించింది.
అలాగే ఈ మహా ఘట్టానికి శంకరాచార్యులందరితో పాటు మహేమండలేశ్వరుల్ని, సిక్కు, బౌద్ధ ఆధ్యాత్మిక గురువుల్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు ట్రస్ట్ తెలిపింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వామినీ నారాయణ్, గాయత్రీ పరివార్, మీడియా సంస్ధల ప్రతినిధులు, క్రీడాకారులు, రైతుల్ని కూడా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ్ పాండే చెక్కిన రామ్ లల్లా విగ్రహాలను ప్రతిష్టిస్తామని ప్రకటించింది. అసలు కార్యక్రమం జనవరి 22నే అయినా దీనికి సంబంధించిన అనుబంధ కార్యక్రమాలు మాత్రం జనవరి 16 నుంచే ప్రారంభమవుతాయని ట్రస్ట్ తెలిపింది.












Click it and Unblock the Notifications