ఎవరికి నష్టం: ఆసక్తి చూపని ఓటర్లు: మందకొడిగా పోలింగ్
లక్నో: అయిదో విడత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇవ్వాళ కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి పోలింగ్ ముగుస్తుంది. ఇంకో రెండు దశల పోలింగ్ పూర్తి కావాల్సి ఉంది. మార్చిలో ఈ రెండు కూడా పూర్తవుతాయి. ఉత్తర ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 10వ తేదీన వెల్లడవుతాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరో.. ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యేదెవరో తేలేది ఆ రోజే.
ఈ రెండు విడతలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఆధిపత్యాన్ని సాధించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తోన్నారు. సమాజ్‌వాది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తోన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.

ప్రధాని మోడీ ఇవ్వాళ బస్తీ, దేవారియాలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. అఖిలేష్ యాదవ్ ఫజిల్ నగర్‌లో పర్యటించారు. కాగా- ప్రచార సభలను నిర్వహించడంలో నాయకులకు ఉన్నంత ఆసక్తి- ఓటు వేయడంపై ప్రజల్లో లేనట్టే కనిపిస్తోంది. ఒకవంక ప్రచార ఉధృతి పతాక స్థాయికి చేరుకుంటోన్నప్పటికీ- ఆ జోరు అయిద విడత పోలింగ్‌లో పెద్దగా కనిపించట్లేదు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. పోలింగ్ మందకొడిగా సాగుతుండటమే దీనికి నిదర్శనం.
మధ్యాహ్నం 3 గంటల వరకు 46.28 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. జిల్లాలవారీగా అమేథీ-46.42, అయోధ్య-50.66, బహ్రాయిచ్-48.75, బారాబంకి-45.53, చిత్రకూట్-51.56, గోండా- 46.62, కౌశంబి-48.66, ప్రతాప్‌గఢ్-44.29, ప్రయాగ్‌రాజ్-42.62, శ్రావస్తి49.40, సుల్తాన్‌పూర్- 46.43 శాతం పోలింగ్ నమోదైంది. అంతకుముందు ఈ ఉదయం 9 గంటల వరకు 8.02 శాతం, 11 గంటల వరకు 21.39 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 34.83 శాతం మేర పోలింగ్ నమోదైంది.
ఏ సెషన్‌లో కూడా భారీగా పోలింగ్ శాతం పెరిగినట్టు కనిపించట్లేదు. చివరి మూడు గంటల్లో పోలింగ్ శాతం ఎంత మేర నమోదవుతుందనేది ఆసక్తిగా మారింది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులు విజ్ఙప్తి చేస్తోన్నప్పటికీ.. పెద్దగా స్పందన లభించట్లేదు. తగ్గుతున్న పోలింగ్ ప్రభావం ఏ పార్టీ గెలుపోటములను ప్రభావితం చేస్తుందనేది ఫలితాల రోజు స్పష్టమౌతుంది. పోలింగ్ తగ్గడం పట్ల అన్ని పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications