కొనసాగుతున్న కరోనా వ్యాప్తి - కేంద్రం అలర్ట్, కీలక సూచనలు..!!
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేసుల వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5,880 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 8గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 85,076 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 5,880 కేసులు గుర్తించారు. కరోనా సన్నద్దంలో భాగంగా దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 35 వేల మార్క్‌ను దాటింది.గత 24 గంటల వ్యవధిలో మొత్తం 14 మంది మృతి చెందగా.. కరోనా కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,30,979కి చేరింది. ప్రస్తుతం 35,199 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.73 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,23,527) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.08 శాతం యాక్టివ్‌గా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.

కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారు. కరోనా పరిస్థితులు ఎదుర్కొనేందుకు వీలుగా సంసిద్దులను చేసేందుకు ఈ రోజు, రేపు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కరోనా నాలుగో వేవ్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. చివరి కోవిడ్ మ్యూటేషన్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7, ఇప్పుడు వస్తున్న మరో వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 వంటి కారణంగానే కేసులు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత కారణంగా తిరిగి మాస్కుల వినియోగం తప్పని సరి చేసారు.
కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ లో విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు తప్పని సరి చేసింది. హర్యానా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించాలని ఆదేశించాయి. అటు హర్యానాలో పాఠశాలల్లో మాస్కును తప్పని సరి చేసారు. తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త వేరియంట్ లక్షణాలు మాత్రం కరోనా సింప్టమ్స్ కంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. వీటి పైన మరింత నిర్ధారణకు రావాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications