ఆరుగురు CBI అధికారులకు ఢిల్లీ హైకోర్టు షాక్- "మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తారా ?"
న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు చేశారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి (CBI) చెందిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక మాజీ ఐఆర్ఎస్ అధికారికి సంబంధించిన కేసులో వీరు కోర్టు ఎదుట వాస్తవాలను దాచిపెట్టి, తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టు నిర్ధారించింది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ ఐఆర్ఎస్ అధికారి అశోక్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, సీబీఐ అధికారులు సుశీల్ దివాన్, వినీత్ వినాయక్, అమిత్ కుమార్, రమణ్ త్యాగి, ప్రేమ్ కుమార్ గౌతమ్, ఎండి ఆజాద్‌లపై లిఖితపూర్వక ఫిర్యాదు దాఖలు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 191 (తప్పుడు సాక్ష్యం ఇవ్వడం), 193 (తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం), 209 (కోర్టులో మోసపూరితంగా తప్పుడు వాదనలు చేయడం) కింద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అశోక్ కుమార్ అగర్వాల్‌పై ఉద్దేశపూర్వకంగా సీబీఐ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే 2016 జనవరిలో ఆయనపై నమోదు చేసిన ప్రాసిక్యూషన్ చెల్లదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సీబీఐ అంతర్గతంగా భావించింది. కానీ అందుకు తగిన ఆధారాలు లేవని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ, న్యాయశాఖ 2016 జూలైలోనే సీబీఐ ప్రతిపాదనను తోసిపుచ్చాయి.

అనంతరం అగర్వాల్ తన దగ్గర జప్తు చేసిన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై సమాధానం ఇస్తూ, ప్రభుత్వం నుంచి అప్పీలు దాఖలు చేయడానికి నివేదికలు ఇంకా పరిశీలనలో ఉన్నాయని సీబీఐ అధికారులు అబద్ధం చెప్పారు. కోర్టు ఈ విచారణలో సీబీఐ అంతర్గత ఫైళ్లను సేకరించి పరిశీలించగా, అసలు విషయం బయటపడింది. దీంతో అప్పీలును ప్రభుత్వం తిరస్కరించిందనే నిజమైన డ్రాఫ్ట్ రాతలను కొట్టివేసి, కావాలనే సంప్రదింపులు జరుగుతున్నాయనే తప్పుడు వాక్యాన్ని చేర్చినట్లు హైకోర్టు నిర్ధారించింది. అనంతరం సీబీఐ అధికారులు తాము తర్వాత తమ తప్పును సరిదిద్దుకున్నామని, దీనివల్ల అగర్వాల్‌కు ఎలాంటి నష్టం కలగలేదని వాదించారు. అయితే వాదనతో విభేదించిన కోర్టు..ప్రభుత్వ వ్యవస్థల తరఫున కోర్టుల్లో వాదనలు వినిపించే అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని సమర్పించడం చట్టపరంగా తీవ్రమైన నేరమని స్పష్టం చేసింది. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి చేసిన ఫిర్యాదును 4 వారాల్లోగా అధికారిక మేజిస్ట్రేట్ కోర్టుకు పంపాలని ఆదేశించింది.














Click it and Unblock the Notifications
