హైకోర్టులో అగ్రవర్ణ జడ్డీలకు పెద్దపీట-2018 నుంచి 75 శాతం నియామకాలు వారివేనన్న కేంద్రం..
దేశంలో హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం జరగడం లేదని మరోసారి తేలిపోయింది. 2018 నుంచి హైకోర్టుల్లో నియమితులైన మొత్తం న్యాయమూర్తులలో 75% మంది అగ్రవర్ణాలవారేనని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తాజాగా లోక్‌సభలో వెల్లడించారు. 2018 నుంచి ఈ ఏడాది జులై 17 వరకు నియమితులైన 604 మంది హైకోర్టు న్యాయమూర్తుల్లో 458 మంది జనరల్ కేటగిరీ, 18 మంది షెడ్యూల్డ్ కులాలు, 9 మంది షెడ్యూల్డ్ తెగలు, 72 మంది ఓబీసీలు, 34 మంది మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని మంత్రి పార్లమెంటుకు తెలిపారు.
గత ఐదేళ్లలో అన్ని హైకోర్టుల్లో నియమితులైన 79% మంది న్యాయమూర్తులు అగ్రవర్ణాలవారే కావడం నిజం కాదా అని ఏఐఎంఐఎం అధినేత, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు న్యాయ మంత్రి సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో హైకోర్టులకు నియమితులైన న్యాయమూర్తులలో 15% మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారేనని న్యాయ శాఖ గత ఏడాది చివర్లో పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపింది.

న్యాయమూర్తుల నియామకంలో కొలీజియం వ్యవస్ధ ఏర్పాటై మూడు దశాబ్దాలు గడిచినా, అది అందరినీ కలుపుకొని, సామాజికంగా వైవిధ్యంగా మారలేదని తన నివేదికలో పేర్కొంది. ఇంకా చెప్పాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం రాజ్యాంగంలోని 124, 217, 224 అధికరణల ప్రకారం జరిగిందని, ఇవి కుల ఆధారిత రిజర్వేషన్‌లను అందించవని తెలిపింది.
నలుగురు న్యాయవాదులను బొంబాయి, మద్రాస్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులుగా నియమించడం ద్వారా మహిళలు, అణగారిన వర్గాల ప్రాతినిధ్యాలు పెరుగుతాయని పేర్కొంటూ న్యాయ శాఖ అభ్యంతరాలను సుప్రీం కోర్టు కొలీజియం తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకంగా నియమించిన న్యాయమూర్తుల్లో ఒకరు ఎస్సీ వర్గానికి చెందినవారు కాగా మరొకరు ఓబీసీ వర్గానికి చెందిన వారని తెలిపారు. న్యాయమూర్తుల నియామకాల్లో కొలీజియానికి బదులు న్యాయనియామకాల కమిషన్ పాత్ర ఉండాలని కేంద్రం కోరుతోంది.












Click it and Unblock the Notifications