బీజేపీ ఆపరేషన్ ఆకర్ష: మాజీ సీఎం సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ జంప్..!!
పనాజీ: గోవాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మనుగడ కోసం పోరాడే పరిస్థితికి దిగజారింది. హస్తం పార్టీలో తలెత్తిన గ్రూపు విభేదాలు దీనికి కారణమైనట్లు చెబుతున్నారు. అదే సమయంలో అధికార భారతీయ జనత పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు లోనయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మూకుమ్మడిగా కాషాయ కండువాను కప్పుకోవడానికి సిద్ధపడ్డారు.
ఈ ఏడాది గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొత్తం 40 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీజేపీ 20 సీట్లను గెలుచుకోగలిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 21 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు, ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు పలికారు. దీనితో మేజిక్ ఫిగర్‌ను దాటింది బీజేపీ.

ప్రమోద్ సావంత్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ తన మిత్రపక్షంతో 12 సీట్లకు పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్.. రెండు చొప్పున సీట్లను గెలచుకున్నాయి. ఈ ఓటమి కాంగ్రెస్ పార్టీని కుదేల్ చేసింది. మిత్రపక్షాలతో కలిసి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ- బీజేపీ ఆపరేషన్ ఆకర్షను కాంగ్రెస్‌పై ప్రయోగించింది. ఉన్న 11 మందిలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోబోతోంది.
సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా పార్టీ ఫిరాయించనున్నారు. సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైఖెల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ ఫల్‌దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్జో సెక్వైరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ ఇవ్వాళ కాషాయ కండువాను కప్పుకోనున్నారు. ఈ మేరకు వారు ఈ ఉదయం శాసనసభ ఆవరణలో స్పీకర్, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను కూడా కలిశారు. పార్టీ ఫిరాయించడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్లు బీజేపీ గోవా చీఫ్ సదానంద్ షెఠ్ తనావదే తెలిపారు.

ఒకవంక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ- భారత్ జోడో యాత్రను కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గోవాలో తలెత్తిన ఈ పరిస్థితులు ఆ పార్టీని మరింత దిగజార్చినట్టే. ఏకంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications