"అమ్మా.. నీకు తోడు నేనున్నా!": తల్లి శవాన్ని మార్చురీకి తీసుకెళ్లిన చిన్నారి!!
ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లాలో గుండెల్ని పిండేసే ఓ విషాదకర ఘటన వెలుగుచూసింది. ఎవరూ లేని అనాథగా మిగిలిన ఓ ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లి మృతదేహంతో ఒంటరిగా ఆస్పత్రిలో గడిపిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కనీసం మరణం అంటే కూడా తెలియని వయసులో ఓ బాలుడు తన కన్నతల్లి మృతదేహాన్ని పోస్టుమార్టం గది వరకు తోడుగా తీసుకెళ్లాడు. "నాకు ఎవరూ లేరు.. నేను ఒక్కడినే వచ్చాను" అంటూ ఆ పిల్లాడు దీనంగా చెబుతుంటే అక్కడున్న వారు చలించిపోయారు.
అసలేం జరిగిందంటే?
ఏటా జిల్లాలోని జెత్రా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన నీలమ్(40) అనే మహిళ గురువారం ఉదయం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె హెచ్ఐవీ సోకడం వల్ల తలెత్తిన ఆరోగ్య సమస్యలతో గత నెల రోజులుగా బాధపడుతోంది. మరణించే సమయానికి ఆమె పక్కన తన ఎనిమిదేళ్ల కుమారుడు శని మాత్రమే ఉన్నాడు.

ఒంటరిగా ఆస్పత్రిలో..
తల్లి చనిపోయిన తర్వాత ఆ పసివాడు ఏం చేయాలో తెలియక ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. బంధువుల ఫోన్ నంబర్లు కూడా తెలియకపోవడంతో ఎవరికీ సమాచారం అందించలేకపోయాడు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి విచారించగా ఆ బాలుడి దీనగాథ వెలుగుచూసింది. తన తండ్రి సురేంద్ర కూడా ఎనిమిది నెలల క్రితం ఇదే వ్యాధితో మరణించాడని ఆ బాలుడు తెలిపాడు.
एटा से इंसानियत को झकझोर देने वाली तस्वीर
— Ritika Rajora (@Rrajora07) January 16, 2026
8 साल का मासूम अपनी मां का शव लेकर अकेला पोस्टमार्टम हाउस पहुंचा।
न रिश्तेदार साथ, न कंधा देने वाला कोई
पिता पहले ही HIV से चल बसे
पुलिसकर्मी ने महिला के अंतिम संस्कार का जिम्मा उठाया#Etah #UttarPradesh #UPNews @etawahpolice pic.twitter.com/94KOmcJbFD
ఆస్తి గొడవలు.. ప్రాణభయం
మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తుండగా శని వెక్కి వెక్కి ఏడ్చాడు. "నాకు ఎవరూ సహాయం చేయడం లేదు.. మా బాబాయ్‌లు ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తున్నారు" అంటూ ఆ బాలుడు చేసిన ఆరోపణలు అక్కడున్న వారిని షాక్‌కు గురిచేశాయి. అయితే పోలీసులు ఈ విషయాన్ని పరిశీలించి, ప్రస్తుతం ఆ బాలుడికి ఎలాంటి ప్రాణహాని లేదని, అతని బంధువులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
పోలీసులే అన్నీ అయి..
నీలమ్ కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. ఇంట్లో సంపాదించే వారు ఎవరూ లేకపోవడంతో పోలీసులు మానవత్వంతో స్పందించారు. అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పోలీసులే స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. శనివారం మధ్యాహ్నం బంధువులు, గ్రామస్థుల సమక్షంలో నీలమ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications