బిజెపిలో చేరుతున్నాం: 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గౌహతి: అస్సాంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని అస్సాం బిజెపి అధ్యక్షుడు సిద్దార్థ భట్టాచార్య ప్రకటించారు.
కాంగ్రెస్ మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇప్పటికే వీళ్లంతా అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. కాగా, ఆయన ఇంతకుముందే బిజెపిలో చేరారు. ఈ తొమ్మిది మందిలో నలుగురిని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
మిగిలిన ఐదుగురిని సస్పెండ్ చేయకపోయినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది.

ఢిల్లీలో అమిత్ షాను కలిసిన ఈ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. తాము పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. వీరిలో బొలిన్ చెటియా (సదియా), ప్రదాన్ బారువా(జొనాయ్), పల్లబ్ లోచన్ దాస్(బెహాలి), రాజెన్ బోర్‌ఠాకూర్ (తేజ్‌పూర్), పిజూష్ హజారికా(రోహా), కృపానాథ్ మల్లా (రతబరి), అబు తాహెర్ బేపారి (గోలక్‌గంజ్), బినంద సైకియా(సిపాఝర్), జయంత మల్లా బారువా(నల్‌బారి) ఉన్నారు.
తొమ్మిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని అస్సాం బిజెపి అధికార ప్రతినిధి రూపమ్ గోస్వామి వెల్లడించారు. పార్టీలో ఎవరు చేరాలనుకున్నా వారికి స్వాగతం చెబుతున్నామన్నారు.
రాష్ట్రంలో బిజెపి ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ విషయం వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని గోస్వామి అన్నారు. ఈ 9మంది రాజీనామా చేస్తే 126 మంది సభ్యులున్న అస్సాం అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 69కి పడిపోతుంది. అయినా.. మేజిక్ ఫిగర్ 63అయినందున ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు.












Click it and Unblock the Notifications