Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‍లో దారుణం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బాలిక మృతి..
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. ముగ్గురు నిందితులు 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం గౌర్ ప్రాంతంలో బాలిక కూరగాయలు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోను సాహ్ని, రాజన్ నిషాద్, కుందన్ సింగ్ అనే ముగ్గురు నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి.. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలింది.
బాలిక తన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. అయితే ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు బాలిక కోసం గాలిస్తుండగా.. కుందన్ సింగ్ ఇంటి సమీపంలో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉందని సాహ్ని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని బాలికను ఆసుపత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం బాలిక మరణించిందని పోలీసులు చెప్పారు.

మోను సాహ్ని అనే నిందితుడికి అమ్మాయి తెలుసునని, అతనే బాలికను తన వెంట తీసుకెళ్లాడని, అతడితో పాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గోపాల్ కృష్ణ చౌదరి తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ చెప్పారు. దీనికి సంబంధించి ముగ్గురిపై అత్యాచారం, హత్య ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. నిందితులను బిజెపి సభ్యులు రక్షించారని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు.
ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతూ ట్వీట్ చేశారు. "రేపిస్టులకు వ్యతిరేకంగా ప్రజలు ఏడుస్తున్నారు. కానీ వారి మనుషులను రక్షించడానికి, బిజెపి ప్రభుత్వం చెవిటిదిగా మారింది. బిజెపి రేపిస్టులకు విశ్రాంతి ప్రదేశంగా అయింది" అని ట్వీట్ చేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్న 18 సెకన్ల వీడియోను కూడా పోస్ట్ చేశాడు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని బిజెపి నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications