Zika Virus: కర్ణాటకలో ఆందోళన కలిగిస్తోన్న జికా వైరస్..
కర్ణాటక జికా వైరస్ కలకలం రేపుతోంది. బెంగళూరు అర్బన్ జిల్లాకు సమీపంలో ఉన్న చిక్కబళ్లాపూర్ జిల్లాలో దోమల్లో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య అధికారులు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రారంభ దశలో వైరస్ ను నిర్మూలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 68 వేర్వేరు ప్రాంతాల్లో దోమల శరీరంలో జికా వైరస్ ఉందో లేదో పరీక్షించామని ఆరోగ్య శాఖ పేర్కొంది.
అలాగే చిక్కబళ్లాపుర జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి నమూనాలను సేకరించినట్లు వివరించింది. సిడ్లఘట్ట తాలూకాలోని తలకాయలబెట్ట గ్రామంలో దోమల్లో జికా వైరస్ కనిపించింది. దీంతో వెంటనే ఆరోగ్య అధికారులు చర్యలు చేపట్టారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలను ప్రారంభించారు. జ్వరం లక్షణాలతో బాధపడుతున్న 30 మంది గర్భిణుల్లో ఏడుగురి రక్త నమూనాలను సేకరించిన అధికారులు బెంగళూరుకు పరీక్షల నిమిత్తం పంపారు.

తలకాయల బెట్ట గ్రామానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల నుంచి నమూనాలు సేకరించారు. వెంకటాపుర, దిబ్బురహళ్లి, బచ్చనహళ్లి, వడ్డహళ్లి తదితర ప్రాంతాల్లో అధికారులు స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. చిక్కబళ్లాపుర జిల్లాలో జికా వైరస్ ఉన్నట్లు చిక్కబళ్లాపుర జిల్లా ఆరోగ్య అధికారి మహేష్‌కుమార్ ధృవీకరించారు.ఈ ప్రాంతంలో సుమారు 5 వేల మందిని ఆరోగ్య అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గతేడాది కర్ణాటకలో తొలి జికా కేసు నమోదైంది. రాయచూర్ జిల్లాలో 5 ఏళ్ల చిన్నారికి జికా వైరస్ సోకింది.
జికా వైరస్ అనేది దోమల ద్వారా సంక్రమించే వైరస్, ఇది మానవులలో అనేక రకాల లక్షణాలను కలిగిస్తుంది. ఇది ప్రధానంగా ఈడెస్ దోమల కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది,ృ. ఇవి పగటిపూట చురుకుగా ఉంటాయి. ఈ వైరస్ ను 1947లో మొదటిసారిగా గుర్తించారు. ఉగాండాలోని జికా ఫారెస్ట్ పేరు మీద ఈ వైరస్ పేరు పెట్టారు. జికా వైరస్ సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. తక్కువ మందిలో జ్వరం,దద్దుర్లు, తలనొప్పి, ఎరుపు కళ్లు, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.












Click it and Unblock the Notifications