హైడ్రోజన్ రైలు ఆ మార్గంలో ట్రయల్ రన్ త్వరలో..ఇదికదా అసలైన రైల్వే విప్లవం!
భారతీయ రైల్వే మరో చారిత్రక ముందడుగు వేయబోతోంది. ఇప్పటికే వందే భారత్,వందే భారత్ స్లీపర్ రైళ్ళు, బుల్లెట్ రైళ్లతో దూసుకుపోతున్న భారత రైల్వే త్వరలో నెల్ల నుండి హైడ్రోజన్ తీసి దానితో రైలును నడపనుంది. పర్యావరణ హితమైన సాంకేతికతతో రూపొందించిన హైడ్రోజన్ రైలును పట్టాలపై పరుగులు పెట్టించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ వినూత్న ప్రయోగానికి వేదికగా హర్యానా రాష్ట్రం లోని జింద్ స్టేషన్ సిద్ధమవుతోంది.
హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య హైడ్రోజన్ రైలు
దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రయోగాత్మకంగా నడపడం భారత రైల్వేకు గర్వకారణంగా నిలవనుంది. ఈ హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ రైళ్లతో పోలిస్తే ఇది చాలా వేగంగా గమ్యస్థానాన్ని చేరుకుంటుందని చెప్తున్నారు.

శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా ప్రయాణం
పర్యావరణ హితానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఈ రైలును తీసుకువస్తున్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా ప్రయాణం సాగడం హైడ్రోజన్ రైలు యొక్క ప్రధాన ప్రత్యేకత. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైలు పూర్తిగా కార్బన్ ఉద్గారాలు లేని రైలుగా గుర్తింపు పొందనుంది. డీజిల్ రైళ్ల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారత రైల్వే ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ అప్పుడే
భవిష్యత్తులో దేశవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే దిశగా ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు రవాణాలో ఎలక్ట్రిక్ ఈ బస్సులతో కాలుష్యానికి చెక్ పెడుతున్న కేంద్రం రైల్వేలోనూ గ్రీన్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ఈ పరీక్షా ప్రయాణం విజయవంతమైతే, మరిన్ని మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను నడిపేందుకు రైల్వే ప్రణాళికలు రెడీ చేస్తోంది.
భారత ప్రభుత్వ లక్ష్యానికి హైడ్రోజన్ రైలు ముఖ్యమైన మైలురాయి
పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక రవాణా వ్యవస్థను ప్రయాణికులకు అందించాలన్న భారత ప్రభుత్వ లక్ష్యానికి ఈ హైడ్రోజన్ రైలు ఒక ముఖ్యమైన మైలురాయిగా మారనుంది. ఏది ఏమైనా భారతీయ రైల్వే త్వరితగతిన విప్లవాత్మకమైన మార్పులతో ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనలోనే కాదు, పర్యావరణ పరిరక్షణకు దృష్టి పెట్టటం శుభ సూచకం.












Click it and Unblock the Notifications