దీపావళి వేళ భారతీయ రైల్వే చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డు!
సాధారణంగా రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసేవారు టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేస్తే తనిఖీలలో దొరికితే ఫైన్ విధిస్తారు. అయితే ప్రతిరోజు తనిఖీలు జరగవు అన్న ఉద్దేశంతో కొంతమంది టికెట్ లేకుండానే ప్రయాణం చేస్తూ ఉంటారు. సహజంగా బస్సులలో ఇలా ప్రయాణాలు చేసే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది కానీ, రైళ్లలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇదే ఇటీవల రైల్వే ఒక్కరోజులోనే కోటి రూపాయలను తెచ్చిపెట్టింది.
దీపావళి వేళ రైళ్ళలో తనిఖీలు
రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఒక్కరోజు రైళ్లలో జరిపిన తనిఖీలలో ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల జరిమానా వసూలు అయిందంటే ఎంతమంది రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించిన రైల్వే అధికారులు దీపావళి పండుగ సమయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కేసులు నమోదు
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాలతో తనిఖీలు చేసిన రైల్వే అధికారులు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల వద్ద నుండి జరిమానాలు వసూలు చేశారు. ఒక్కరోజులోనే ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లలో లభించింది. అలాగే టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారిపై మొత్తం 16,105 కేసులు నమోదు చేశారు.
రికార్డ్ స్థాయిలో ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు జరిమానా
సాధారణంగా జోన్ పరిధిలో రోజువారి టికెట్లను తనిఖీ చేస్తే సుమారు 47లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారతీయ రైల్వే చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది . టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుల నుండి ఫైన్ వసూలు చేయగా ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు జరిమానా వసూలు అయింది.
అయితే అంతకన్నా ముందు గతంలో ఆరవ తేదీన నిర్వహించిన డ్రైవ్ లో 92.4లక్షల రూపాయలు వసూలైంది.
జరిమానా వసూళ్ళలో ముందువరుసలో విజయవాడ డివిజన్
ఈ జరిమానా వసూళ్లలో విజయవాడ డివిజన్ ముందు వరుసలో ఉంది. విజయవాడ డివిజన్లో 36.91 లక్షల రూపాయలు వసూలయ్యాయి. సికింద్రాబాద్ డివిజన్ నుండి 27.9 లక్షలు, గుంతకల్లు డివిజన్ నుంచి 28 లక్షలు, గుంటూరు డివిజన్ పరిధిలో 6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్లో 4.6 లక్షలు, నాందేడ్ డివిజన్ నుంచి 4.8 లక్షలు చొప్పున అధికారులు జరిమానా వసూలు చేశారు. ఏదిఏమైనా రైల్వే చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో జరిమానా వసూలు కావడం తొలిసారి. అందుకే దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications