జార్ఖండ్‌లో వింత ఘటన : నోటిలో దంతాలతో జన్మించిన శిశువు..
జార్ఖండ్‌లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నవజాత శిశువు నోటిలో దంతాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో ఆసుపత్రిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువు ఏం చేస్తాడు.. ఏడుస్తాడు.. ఆ శిశువు అదేపనిచేశాడు. అయితే ఆ మహిళ కుటుంబసభ్యులు ఆసుపత్రి సిబ్బంది ఆ శిశువును చూసి షాకయ్యారు.
ఆ పిల్లవాడి నోటిలో రెండు దంతాలు కనిపించాయి. అప్పుడే పుట్టిన శిశువుకు దంతాలు ఉండడం ఏంటనీ డాక్టర్లు ఆలోచనలో పడ్డారు. అయితే, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ శిశువును ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి సర్జరీ చేసి ఆ రెండు పళ్లను తొలగించారు. ఈ వింత ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఈ నెల 11వ తేదిన సర్జామడలో నివాసముంటున్న శివ కర్వా భార్య సునీతాదేవికి పురిటినొప్పులు వచ్చాయి. దాంతో ఆమె కుటుంబసభ్యులు పర్సుదిహ్‌లో ఉన్న సదరు ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు. పురుటినొప్పులతో భాధపడుతున్న ఆ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ చిన్నారి పుట్టగానే ఏడ్చింది.
దాంతో ఆ శిశువును చూసిన డాక్టర్లు, సిబ్బంది, కుటుంబసభ్యులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. ఆ శిశువుకు పుట్టుకతోనే నోటిలో రెండు దంతాలు వచ్చాయి. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆ చిన్నారి దంతాలను తొలగించారు. ఆ శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయని, చాలా తక్కువ మంది పిల్లల్లోనే ఇలాంటివి కనిపిస్తాయని డాక్టర్లు తెలిపారు. పుట్టుకతో వచ్చిన దంతాలు బలహీనంగా ఉంటాయని, అవి చాలా సులభంగా ఊడిపోతాయని, కొంతమంది పిల్లలకు రెండు కంటే ఎక్కువ దంతాలు కూడా ఉంటాయని, ఈ బిడ్డకు దిగువ చిగుళ్లలో రెండు పళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications