నేడే కేజ్రీవాల్‌కు పరీక్ష: రైళ్లలో, రిక్షాపై సభకు ఎమ్మెల్యేలు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఎఎపి 28 సీట్లను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎనిమిది మంది సభ్యులు తక్కువగా ఉండటంతో కాంగ్రెసు పార్టీ బయటి నుండి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో కేజ్రీవాల్ డిసెంబర్ నెలాఖరులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఆయన తన బలం నిరూపించుకోవాల్సి ఉంది.
బస్సుల్లో, మెట్రో రైళ్లలో అసెంబ్లీకి
ఎఎపి ప్రజాప్రతినిధులు బుధవారం ఢిల్లీలో మొదలైన సమావేశాలకు సాధారణ పౌరుల్లా బస్సులు, మెట్రో రైళ్లలో వచ్చారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. ఎన్నికల తర్వాత మొదలైన తొలి సమావేశాల్లో 70 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ప్రమాణం చేశారు.

ఈ సమావేశాలకు తన సొంత వాహనంలో కేజ్రీవాల్ వచ్చారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలోని ఆరుగురు కొత్త మంత్రులు మెట్రో రైలులో వచ్చారు. ఎమ్మెల్యేలు కొందరు సొంత వాహనాల్లో, మరికొందరు మెట్రో, డిటిసి బస్సుల్లో వచ్చారు. రోహిణి నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేష్ గార్గ్ బ్యాటరీతో నడిచే రిక్షాను స్వయంగా నడుపుకుంటూ వచ్చారు. మరోవైపు కాంగ్రెసు, బిజెపి నేతలు ఖరీదైన కార్లలో సమావేశాలకు వచ్చారు.
హామీల్లో భాగంగా...
ఎన్నికల హామీల అమలులో భాగంగా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల(డిస్కంలు) ఆర్థిక వ్యవహారాలపై కాగ్ ఆడిట్‌కు ఆదేశాలిచ్చింది. బుధవారం సాయంత్రం జరిగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కాగ్ కూడా సమ్మతించిందని ఈ భేటీ అనంతరం ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications