రాఘవ్ ఛద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ భారీ షాక్
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛద్దాకు భారీ షాక్ తగిలింది. ఆయనను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి స్వయానా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకత్వం తొలగించింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కు లేఖ రాసింది. అలాగే- సభలో ఆయనకు మాట్లాడే సమయం కూడా కేటాయించవద్దని కోరింది. రాజ్యసభ డిప్యూటీ నాయకుడిగా రాఘవ్ ఛద్దా స్థానంలో అశోక్ మిట్టల్ పేరును ఆమ్ ఆద్మీ పార్టీ సిఫారసు చేసింది.
పంజాబ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు రాఘవ్ ఛద్దా. గతంలో ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కుడిభుజంగా మెలిగారు. ఇటీవల జీరో అవర్‌లో చురుకుగా ఉంటోన్నారు. దేశవ్యాప్తంగా గిగ్ కార్మికుల సామాజిక భద్రత కోసం ప్రభుత్వాన్ని మేల్కొలిపిన ఘనత ఆయనకు దక్కింది. మొబైల్ ఫోన్ల రీఛార్జ్, ఇంటర్నెట్ వ్యవహారాల్లో అతి సున్నితమైన అంశాలను ప్రస్తావించారు. ఇవన్నీ కూడా సామాన్యుడిని సైతం ఆకట్టుకున్నాయి. ఆయన లేవనెత్తిన అంశాలన్నీ ఆలోచింపజేశాయి.

ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి రాఘవ్ ఛద్దాను రాజ్యసభ ఉప నేత పదవి నుంచి తొలగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ పేరును సూచించడం చర్చనీయాంశమౌతోంది. ఆప్ కోటా నుండి రాజ్యసభలో మాట్లాడే సమయం కూడా కేటాయించవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆప్ రాజ్యసభ నాయకుడు సంజయ్ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఛైర్మన్ సెక్రెటేరియట్ కు లేఖ పంపినట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి.
అశోక్ మిట్టల్ కూడా ఏప్రిల్ 2022లో పంజాబ్ నుండే రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అనంతరం డిఫెన్స్, ఫైనాన్స్ కమిటీలతో సహా పలు పార్లమెంటరీ కమిటీలలో చురుకుగా పనిచేశారు. గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రష్యా, లాత్వియా, స్లోవేనియా, గ్రీస్, స్పెయిన్‌లను సందర్శించిన డీఎంకే ఎంపీ కనిమొళి సారథ్యంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలోనూ మిట్టల్ సభ్యుడిగా ఉన్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్‌గా వ్యవహరిస్తోన్నారు మిట్టల్.
ప్రస్తుతం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో ఏడుమంది పంజాబ్ నుండి ఎన్నికైన వారే. మిగిలిన ముగ్గురు ఢిల్లీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది పంజాబ్. ఈ నేపథ్యంలో రాఘవ్ ఛద్దా సేవలను పూర్తిగా పంజాబ్ కే పరిమితం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి నుంచే పంజాబ్ లో ఆయన సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలనే యోచిస్తోన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications