ఆగస్టు 15 నుంచి కాక్రోచ్ కొత్త యుద్ధం! పల్లె బడుల కోసం సర్పంచ్ ఛాలెంజ్
స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కాబొస్తున్నా, నేటికీ గ్రామాల్లోని బడి పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొత్త పార్లమెంటు భవనాలు, రాజప్రాసాదాలు రూపుదిద్దుకుంటున్న దేశంలో.. మన పల్లెల్లోని పాఠశాలలు మాత్రం నేటికీ నిరాదరణకు గురవుతుండటంపై గొంతుక విప్పాయి యువత బృందాలు. గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఒక భారీ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పల్లె బడుల పునర్నిర్మాణ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

80 ఏళ్ల స్వాతంత్ర్యం.. తీరని పల్లె బడుల వ్యథ!
మహారాష్ట్రలోని హింగోలీ గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నట్లు వెల్లడించిన దిప్కే, దేశంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన రంగం ఏదైనా ఉందంటే అది పల్లెల్లోని ప్రభుత్వ బడులేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కూలీల పిల్లలకు నాణ్యమైన చదువు అందించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. నేటికీ విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ నడిచి బడికి వెళ్లాల్సి వస్తోందని, అక్కడికి వెళ్లాక కనీసం తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కూడా ఉండకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
సర్పంచ్‌లకు సవాల్: 'మన ఊరు - మన బడి'
ఈ ఉద్యమంలో భాగంగా దేశంలోని సర్పంచ్‌లకు సీజేపీ ఒక ప్రత్యేక పిలుపునిచ్చింది. 'సర్పంచ్ ఛాలెంజ్' పేరుతో ప్రతి గ్రామాధికారి తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను రూపురేఖలు మార్చాలని కోరింది. ఇలా బడులను బాగుచేసిన సర్పంచ్‌ల వివరాలను, బడి పాత-కొత్త చిత్రాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందుకు తీసుకెళ్లి, వారికి తగిన గౌరవాన్ని అందిస్తామని తెలిపింది. దీనివల్ల స్ఫూర్తి పొంది మిగిలిన ఊళ్ల సర్పంచ్‌లు కూడా తమ పల్లె బడుల బాగు కోసం ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల ఆధ్వర్యంలో 'సోషల్ ఆడిట్'
మరోవైపు, ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్న తల్లిదండ్రులను నేరుగా భాగస్వాములను చేస్తూ 'సోషల్ ఆడిట్' చేపట్టాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు స్వయంగా బడులకు వెళ్లి తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలని సూచించారు. సదుపాయాలు లేకపోతే వీడియోగ్రాఫ్ తీసి సమర్పించాలని కోరారు. దీనికోసం త్వరలోనే ప్రత్యేక ఆడిట్ ఫారాన్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. పట్నం పిల్లలతో సమానంగా పల్లె పిల్లలకు కూడా వసతులు అందాలన్నదే తమ ఆకాంక్ష అని, "నిజమైన భారతం పల్లెల్లోనే ఉందనే" సందేశంతో ఈ పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు ప్రకటించారు.














Click it and Unblock the Notifications