జయ ఆరోగ్యం, అపోలో హెల్త్ బులిటెన్స్ ఇవే: నమ్మచ్చా ?
సెప్టెంబర్ 22వ తేదిన అమ్మ జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన తరువాత అప్పటి నుంచి డిసెంబర్ 4 వతేది వరకు వారు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లు, నాయకులు చెబుతున్న మాటలను తాము ఏలా నమ్మాలి ?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషయంపై చెన్నైలోని అపోలో ఆసుపత్రి వైద్యులు ఎందుకు రోజుకో విధంగా చెబుతున్నారు ? అని అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆ పార్టీ నాయకులను నిలదీస్తున్నారు.
సెప్టెంబర్ 22వ తేదిన అమ్మ జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 29వ తేదిన అపోలో ఆసుపత్రి వైద్యులు బులిటెన్ విడుదల చేసి జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు.

అక్టోబర్ 1వ తేదిన జయలలిత ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను ఖండించిన అన్నాడీఎంకే నాయకులు అలా చేసిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని చెన్నై నగర పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు.

సీఎం జయలలితకు చికిత్స చేసే విషయంలో లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ ను అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన సలహా కోరారు. తరువాత అనేక సార్లు డాక్టర్ రిచర్డ్ లండన్ నుంచి చెన్నై వచ్చి జయలలితకు చికిత్స చేసి వెళ్లారు.

నవంబర్ 3వ తేదిన జయలలిత సంపూర్ణంగా కోలుకున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. అదే నెల 13వ తేదిన జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలో విధులు నిర్వహిస్తారని అన్నాడీఎంకే నాయకులు ఓ లేఖ (జయలలిత సంతకం చేశారని చెప్పారు) విడుదల చేశారు.

నవంబర్ 19వ తేదిన జయలలితను ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు తరలించామని అపోలో వైద్యులు చెప్పారు. డిసెంబర్ 4వ తేది మద్యాహ్నం రెండు రోజుల్లో అమ్మ ఇంటికి వచ్చేస్తారని అపోలో ఆసుపత్రి దగ్గర అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధులు చెప్పారు.

అయితే అదే రోజు సాయంత్రం జయలలితకు గుండెపోటు వచ్చిందని ఐసీయూలో చికిత్స చేస్తున్నామని అపోలో వైద్యులు ప్రకటించారు. డిసెంబర్ 5వ తేదిన జయలలితకు సర్జరీ చేశారని అన్నాడీఎంకే నాయకులు తనకు చెప్పారని, ఆమె క్షేమంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు.

అయితే జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి అక్కడి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లు, నాయకులు చెబుతున్న మాటలను తాము ఏలా నమ్మాలి ? ఇప్పుడు చూస్తున్న పరిస్థితి గమనిస్తే ఎవరైనా వారు చెప్పిన మాటలు నమ్ముతారా ? అంటూ అమ్మ అభిమానులు అన్నాడీఎంకే నాయకులను ప్రశ్నిస్తున్నారు. అమ్మ అభిమానులకు సమాధానం చెప్పలేక అన్నాడీఎంకే నాయకులు సతమతం అవుతున్నారు.












Click it and Unblock the Notifications