కేంద్రం మెడకు చుట్టుకున్న 2జీ స్పెక్ట్రమ్‌ తీర్పు.. భారీగా నష్టపరిహారం కోరుతున్న కంపెనీలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ ట్రయల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది.

తమ తప్పేమీ లేకపోయినా తమ స్పెక్ట్రమ్ లైసెన్సులు రద్దు చేసినందుకుగాను తమకు రూ.17,000 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరూతూ ఈ కుంభకోణం వ్యవహారంలో నష్టపోయిన ఆయా టెలికాం కంపెనీలు కోర్టు మెట్లు ఎక్కబోతున్నాయి.

తీవ్రంగా నష్టపోయిన టెలికాం కంపెనీలు...

తీవ్రంగా నష్టపోయిన టెలికాం కంపెనీలు...

2008లో యూపీఏ ప్రభుత్వం హయాంలో 2జీ స్పెక్ట్రమ్ వేలం జరిగింది. ఆ తరువాత 2జీ స్పెక్ట్రమ్ వేలంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి టెలికాం మంత్రి ఎ.రాజా రాజీనామా చేశారు. ఈ కుంభకోణం కేసులో 2012లో సుప్రీంకోర్టు ఆయా టెలికాం కంపెనీలకు చెందిన 122 లైసెన్సులను రద్దు చేసింది. దీంతో టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా సీబీఐ ట్రయల్ కోర్టు 2జీ కుంభకోణం కేసు ఊహాజనితంగా ఉందని, సీబీఐ సరైన ఆధారాలు సమర్పించలేకపోయిందని చెబుతూ ఈ కేసులో నిందితులుగా ఉన్న టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, కనిమొళి సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

 భారీ పరిహారం కోరేదిశగా కంపెనీలు...

భారీ పరిహారం కోరేదిశగా కంపెనీలు...

ఈ నేపథ్యంలో వీడియోకాన్ టెలికాం కంపెనీ ప్రభుత్వం నుంచి రూ.10,000 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుండగా, లూప్ టెలికాం కూడా రూ.4,000 కోట్లు నష్టపరిహారం కింద చెల్లించాలని కోరనుంది. ఈ కంపెనీలు గతంలోనే నష్టపరిహారం కోరుతూ టెలికాం డిస్ప్యూట్ సెటిల్‌మెంట్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌(టీడీశాట్)లో కేసు దాఖలు చేశాయి. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతున్నందున, కేసు కోర్టు విచారణలో ఉన్నందున తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేమంటూ టీడీశాట్ అప్పట్లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తాజాగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయా టెలికాం కంపెనీలకు జవసత్వాలు వచ్చినట్లయింది. దీంతో తాము గతంలో దాఖలు చేసిన కేసులను మళ్లీ తిరగదోడేందుకు ఈ కంపెనీలు తమ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి.

లైసెన్సుల రద్దుతో కుదేలైన వీడియోకాన్...

లైసెన్సుల రద్దుతో కుదేలైన వీడియోకాన్...

2012లో సుప్రీం కోర్టు రద్దు చేసిన 122 టెలికాం లైసెన్సుల్లో 21లైసెన్సులు వీడియోకాన్ టెలికాం కంపెనీవి. ఆరు సర్కిల్స్ లో టెలికాం సేవల కోసం కంపెనీ అప్పట్లోనే ఈ లైసెన్సుల కోసం రూ.1,500 కోట్లు చెల్లించింది. నిజానికి ఈ కంపెనీ టెలికాం వ్యాపారంలోకి ప్రవేశించేందుకు రూ.25,000 కోట్ల రుణాలు తీసుకుంది. చివరికి సుప్రీం కోర్టు తీర్పుతో వీడియోకాన్ ఆ లైసెన్సులను 2012 నవంబరులో భారతి ఎయిర్ టెల్ కు రూ.2,221.44 కోట్లకు విక్రయించింది. టెలికాం లైసెన్సుల రద్దుతో తీవ్రంగా ఆదాయన్ని నష్టపోయినందున తమకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని వీడియోకాన్ 2015లోనే టెలికాం ట్రిబ్యునల్‌లో వీడియోకాన్ కేసు దాఖలు చేసింది. ‘‘మాకు ఎంత లేదన్నా రూ.10,000 కోట్లకుపైనే నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నుంచి ఈ నష్టపరిహారం ఇప్పించాలని కేసు దాఖలు చేయాలనుకుంటున్నాం..'' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కంపెనీ సీనియర్ మేనేజ్‌మెంట్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

 వీడియోకాన్ బాటలోనే లూప్, యస్‌టెల్...

వీడియోకాన్ బాటలోనే లూప్, యస్‌టెల్...

వీడియోకాన్ బాటలోనే లూప్, యస్‌టెల్ కంపెనీలు కూడా నష్టపరిహారం కోరుతూ కోర్టు మెట్లు ఎక్కనున్నాయి. లూప్‌ టెలికాం కంపెనీ తాను దేశవ్యాప్త లైసెన్స్‌ కోసం చెల్లించిన రూ. 1,658 కోట్లను తిరిగి చెల్లించాలని కోరుతూ 2012లోనే టీడీ శాట్‌ను ఆశ్రయించింది. 22 టెలికం సర్కిళ్లకూ కలిపి దేశవ్యాప్త లైసెన్స్‌ ఎంట్రీ ఫీజు రూ. 1,454 కోట్లు అని, దీనికి వడ్డీ రూ.738 కోట్లు అని, ఈ ఫీజుతోపాటు లైసెన్స్‌ రద్దు వలన తమ ప్రతిష్టకు జరిగిన నష్టానికి గాను మరో రూ. 1,000 కోట్లు, టెలికాం వ్యాపారం నుంచి అర్థంతరంగా వైదొలగినందుకు మరో రూ.830 కోట్లు నష్టపరిహారం.. మొత్తం కలిపి రూ.4000 కోట్లు తమకు కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కింద ఇప్పించాలనేది లూప్‌ టెలికాం డిమాండ్‌. అయితే ‘మీపై నేరపూరిత విచారణ పెండింగ్‌లో ఉంది' అంటూ ఈ వాదనను అప్పట్లో టీడీ శాట్‌ కొట్టేసింది. ఇప్పుడు సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినందున ఈ సంస్థ మరోసారి పాత కేసును తిరగదోడేందుకు నిర్ణయించుకుంది. ఇక యస్‌టెల్ కంపెనీ అధినేత సి.శివశంకరన్ కూడా తాము కోల్పోయిన 6 లైసెన్సులకుగాను నష్టపరిహారం కింద రూ.3,400 కోట్లు పొందేందుకు కేసు దాఖలు చేయబోతున్నారు.

 అప్పీలుకెళ్లే యోచనలో ప్రభుత్వం...

అప్పీలుకెళ్లే యోచనలో ప్రభుత్వం...

2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుతో కేంద్రం ఆలోచనలో పడింది. మరోవైపు లైసెన్సులు కోల్పోయిన కంపెనీలు భారీ పరిహారం కోరుతుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై హైకోర్టుకు వెళ్లడమే ముందున్న మార్గంగా కేంద్రం భావిస్తోంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే ఐదేళ్ల క్రితం సుప్రీంకోర్టు 122 లైసెన్స్‌లను రద్దు చేసిన అంశాలను తాజాగా సీబీఐ కోర్టు తన తీర్పులో పరిగణనలోకి తీసుకోలేదని కొందరు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది కూడా న్యాయపోరాటంలో కేంద్రానికి కలిసివచ్చే అంశమని వారు చెబుతున్నారు. ఏదిఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో టెలికాం కంపెనీలు కోరుతున్న భారీ పరిహారాన్ని కేంద్రం చెల్లించలేదు కాబట్టి ఈ కేసులో అప్పీలు చేసుకుంటూ వెళ్లడమే మార్గమని సూచిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After the special CBI court verdict in the controversial 2G case on December 21, the government faces compensation claims worth over Rs 17,000 crore from telcos like Videocon Telecom, Loop Telecom and STel who suffered loss of business after the Supreme Court scrapped 122 licences in 2012. These licences were issued in 2008 by the-then UPA government. The CBI court this week acquitted all accused including the-then telecom minister A. Raja, saying it did not find any evidence of wrongdoing against them. These telcos now plan to pursue their compensation claims with a new vigour. Videocon Telecom and Loop Telecom have already filed compensation claims of Rs 10,000 crore and Rs 4,000 crore respectively in the telecom tribunal, which they now want to put on fast-track.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి