కేంద్రం ప్లాన్ కు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ కౌంటర్- 48 గంటల వ్యవధిలోనే..!
ఏపీలో యువ జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు తాజాగా ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రజల్ని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అర్హతగా ప్రకటించేలా ఓ చట్టం కూడా చేస్తామని వెల్లడించారు. ఏపీయే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోనూ యువ జనాభా తగ్గిపోతోందంటూ చంద్రబాబు పలు గణాంకాలు కూడా చెప్పారు. చంద్రబాబు ఈ ప్రకటన చేసిన 48 గంటల్లో తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్పందించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో యువ జనాభా తగ్గిపోతోందంటూ చంద్రబాబు చెప్పిన రెండు రోజుల వ్యవధిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. తమిళనాడు ప్రజలు కూడా ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. చెన్నైలో హెచ్‌ఆర్ -సిఇ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన ఉచిత వివాహాల కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్.. ప్రజలకు 16 రకాల సంపదలు ఉండాలన్న పాత తమిళ సామెతను ప్రస్తావించారు.

తమిళనాడులో తగ్గుతున్న జనాభా కారణంగా పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య తగ్గే పరిస్థితి తలెత్తినప్పుడు, పరిమితులతో ఎందుకు జీవించాలనే ప్రశ్న తలెత్తుతుందని స్టాలిన్ తెలిపారు. మనకు కూడా 16 మంది పిల్లలు ఉండొచ్చనే ఆలోచన కూడా వచ్చిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని యోచిస్తోందన్న నివేదికల నేపథ్యంలో దక్షిణాదికి చెందిన ఇద్దరు సీఎంలు చంద్రబాబు, స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications