వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐ రమణ మరో సంచలనం- ట్రిబ్యునళ్లను మూసేయమంటారా? -మోదీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థ పరిధి, దానికి రాజ్యాంగంలోని ఇతర వ్యవస్థ నుంచి అందాల్సిన సహకారం తదితర అంశాలపై రాజీలేని ధోరణి ప్రదర్శిస్తున్నారు. సీబీఐ చీఫ్ నియామకం సహా పలు విషయాల్లో మోదీ సర్కారు వాంఛకు భిన్నంగా జస్టిస్ రమణ మాట నెగ్గడం గమనార్హం. తాజాగా కేంద్ర సంస్థలైన సీబీఐ, ఐబీలపై మండిపడ్డ రమణ.. అంతలోనే ట్రిబ్యునల్స్‌ విషయంలో మరోసారి కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ట్రిబ్యునళ్లు మూసేయమంటారా?

ట్రిబ్యునళ్లు మూసేయమంటారా?

దేశ వ్యాప్తంగా వివిధ ట్రిబ్యునళ్లలో ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్స్ లో ఖాళీలపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ట్రిబ్యునళ్లకు బ్యూరోక్రసీ అవసరం లేదా?' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి సూటిగా ప్రశ్నించింది.

హక్కుల్ని నిరాకరిస్తారా?

హక్కుల్ని నిరాకరిస్తారా?

ట్రిబ్యునల్స్‌ నిర్వీర్యమయితే.. ట్రిబ్యునల్స్‌ అమలు చేసే చట్టపరమైన ప్రాంతాలపై హైకోర్టులకు అధికారం లేని సమయంలో న్యాయం కోసం ఫిర్యాదుదారులు ఎక్కడకు వెళ్లాలని సుప్రీం ధర్మాసనం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ప్రశ్నించింది. మీరు ట్రిబ్యునల్స్‌ అవసరం లేదనుకుంటే.. వారి అధికార పరిధిని హైకోర్టులకు బదిలీ చేసేందుకు అనుమతించండి. లేదా ట్రిబ్యునల్స్‌ను కొనసాగించాలనుకుంటే ఖాళీలను భర్తీ చేయండి. న్యాయం పొందే ప్రజల హక్కును మీరు నిరాకరించలేరు అని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

సీజేఐ రమణ ఆగ్రహం..

సీజేఐ రమణ ఆగ్రహం..

కీలకమైన ట్రిబ్యునల్స్ లో ఉన్న 200 ఖాళీలకు పైగా వివరాలను ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ రమణ చదివి వినిపించారు. ఇది చాలా విచారకరమైన పరిస్థితిని వెల్లడిస్తోందని అన్నారు. 15కు పైగా ట్రిబ్యునళ్లకు ప్రిసైడింగ్‌ అధికారులు లేరని న్యాయస్థానం తెలిపింది. ఖాళీలను భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం ఎక్కువ శాతం తిరస్కరించిందని పేర్కొంది. ట్రిబ్యునళ్లు ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. ట్రిబ్యునల్స్ ఉండడం అధికారులకు ఇష్టం లేనట్లు కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ సమయంలో ఈ విషయాన్ని తప్పక చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ను సీజేఐ జస్టిస్‌ ఎన్​.వి. రమణ ఆదేశించారు. ట్రిబ్యునళ్ల ఖాళీలపై సుప్రీంకోర్టు ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే ఈ ఖాళీల భర్తీ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో పది రోజుల్లో తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేశారు.

అంతకుముందు సీబీఐ, ఐబీపైనా

అంతకుముందు సీబీఐ, ఐబీపైనా

ట్రిబ్యునళ్ల అంశంపై విచారణకు కొద్ది గంటల ముందు కూడా సీజేఐ సంచలన వ్యాఖ్యలుచేశారు. న్యాయమూర్తులపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న ఫిర్యాదులపై సీబీఐ, ఇంటలిజెన్స్ బ్యూరో తగిన విధంగా స్పందించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో న్యాయమూర్తిని ఆటోతో ఢీ కొట్టి హత్య చేసిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. విచారణలో చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం.. సీబీఐ, ఐబీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తుల ఫిర్యాదుల విషయంలో ఏమీ చేయడం లేదని.. ఏమైనా చేస్తారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

జడ్జిలపై దాడులు, తిట్లు

జడ్జిలపై దాడులు, తిట్లు

న్యాయమూర్తులను కేవలం శారరీరకంగా మాత్రమే కాదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం ద్వారా మానసికంగా కూడా వేధిస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో సీబీఐ విచారణకు ఆదేశించినా ఎలాంటి ఫలితం ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో న్యాయమూర్తులను అత్యంత దారుణంగా కించ పరుస్తూ కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టు సీబీఐనిఆదేశించింది. అయితే ఆ కేసులో ఇంత వరకూ సీబీఐ పెద్దగా దర్యాప్తు చేసిందేమీ లేదు. ఇటీవలి కాలంలో ఒకరిద్దర్ని అరెస్ట్ చేసింది. కానీ ఆకేసును చేధించడంలో మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు. న్యాయమూర్తులపై దాడులకు సంబంధించి విచారణలకు ఆదేశించినా సీబీఐ ఏమీ చేయడం లేదని.. మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నా.. అది వాస్తవంలోకి రావడం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు.

సీజేఐ రమణ చురకలు ఎవరికి?

సీజేఐ రమణ చురకలు ఎవరికి?

కోర్టు తీర్పులు వ్యతిరేకంగా ఇచ్చిన న్యాయమూర్తులను కించ పర్చడం అనేది దేశంలో కొత్త ట్రెండ్‌గా మారిందని సీజేఐ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు చేసినా.. ప్రయోజనం ఉండటం లేదు.. న్యాయవ్యవస్థకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదని స్పష్టం చేశారు. ఈ కామెంట్లను తాను పూర్తి బాధ్యతతో చేస్తున్నట్లుగా అటార్నీ జనరల్‌కు సీజేఐ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కోర్టు తీర్పులపై అధికార వైసీపీ నేతలు బాహాటంగా విమర్శలు చేస్తుండటం, దానిపై సీబీఐ దర్యాప్తు సైతం కొనసాగుతుండటం, ఏకంగా ఏపీ సీఎం వైఎస్ జగనే జస్టిస్ ఎన్వీ రమణపై అతి తీవ్ర ఆరోపణలు చేసున్న నేపథ్యంలో సీజేఐ రమణ తాజా చురకలు ఇటు ఏపీ నేతలకు కూడా వర్తిస్తాయనే చర్చ నడుస్తోంది.

English summary
The Supreme Court on Friday asked the Central government point-blank to come clean on whether it intends to “close” tribunals across the country by not filling up vacancies that have been pending for years. “The question here is whether you really want these tribunals to continue or do you intend to close them... Is it that the bureaucracy does not want these tribunals?” Chief Justice of India (CJI) N.V. Ramana asked Solicitor General Tushar Mehta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X