తమిళనాట ఎన్నికల చిత్రాలు ... బట్టలుతికిన అన్నాడీఎంకే అభ్యర్థి .. గెలిస్తే వాషింగ్ మెషీన్ హామీ తమిళనాడు అసెం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆల్ ఫ్రీ మేనిఫెస్టోలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న నేతలు, ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

బట్టలు ఉతికిన నాగపట్నం ఏఐఏడీఎంకే అభ్యర్థి
కొందరు టీ కొట్టు దగ్గర టీ పెడితే, మరి కొందరు బజ్జీలు వేస్తున్నారు. ఇంకొందరు ఇస్త్రీ చేస్తూ.. ఇలా కనిపించిన ప్రతి ఒక్క పని చేస్తూ ఓటు బ్యాంకు కోసం చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాజాగా నాగపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏఐఏడీఎంకే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన తంగా కతిరావన్ ఆయన చేసిన పనితో వార్తల్లో నిలిచారు. బహిరంగంగా బట్టలు ఉతికి సంచలనం సృష్టించారు . అక్కడి వారిని ఆశ్చర్యానికి గురి చేశారు .

తాను గెలిస్తే వాషింగ్ మెషీన్ ఇస్తానని హామీ
ఆయన ఈ ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వాషింగ్ మిషన్ ఇస్తామని, అమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు . తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన నేత ప్రచార పర్వంలో ఓ మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించడంతో, ఆమెను ఒప్పించి బట్టలు ఉతికే అని చేపట్టాడు . ఇక ఆ ఓటరును పక్కన కూర్చోబెట్టి బట్టలు ఉతికి సంచలనం సృష్టించారు. పనిలో పనిగా పక్కనే ఉన్న గిన్నెలను కూడా తోమి అక్కడివారు అందరినీ అవాక్కయ్యేలా చేశారు.

ఓట్ల కోసం అభ్యర్థుల విన్యాసాలు ... వైరల్ గా మారుతున్న వీడియోలు
ఏది ఏమైనా ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు చేస్తున్న విన్యాసాలు ఓటర్లకు ఆసక్తికరంగా మారగా, ఎన్నికల్లో తాను గెలిస్తే వాషింగ్ మెషిన్ ఇస్తానన్న వాగ్దానం పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తానికి జోరుగా సాగుతున్న ప్రచార పర్వంలో ఎవరికి వారు సరి రారు మాకేవ్వరు అంటూ ఓటర్ల దగ్గర ఓట్ల కోసం సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇక ఇలా విన్యాసాలు చేస్తున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .












Click it and Unblock the Notifications