శశికళకు చెక్, ఎదురేగిన పన్నీరు: గవర్నర్‌ని విమానంలోనూ వదల్లేదు
తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అందరిచూపు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావు పైన ఉంది. ఆయన ఏం చేస్తారనే దాని పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చెన్నై: తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అందరిచూపు ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావు పైన ఉంది. ఆయన ఏం చేస్తారనే దాని పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ప్రతి కదలికను మీడియా ప్రముఖంగా గమనిస్తోంది.. చూపిస్తోంది.
గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి చెన్నైకు గవర్నర్ వచ్చారు. విమానంలో కూడా మీడియా ప్రతినిధులు ఆయనను వదలలేదు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని విమానంలోనే ఆయనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ ఆయన మాట్లాడలేదు.
కాగా, పన్నీరు సెల్వంకు ముందు అపాయింటుమెంట్ ఇవ్వడం, ఎమ్మెల్యేలతో పాటు కాకుండా శశికళకు ఒక్కదానికే గవర్నర్ అపాయింటుమెంట్ దొరకడం, బీజేపీ సహా విపక్షాల మద్దతు పన్నీరు సెల్వంకు ఉండటాన్ని బట్టి చూస్తుంటే శశికళకు చెక్ పెట్టినట్లే కనిపిస్తోందని అంటున్నారు.

నోరు మెదపని గవర్నర్
విద్యాసాగర రావు మాత్రం నోరు మెదపలేదు. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం పైన మాట్లాడేందుకు ఆయన ఏమాత్రం ఇష్టపడలేదు. చెన్నై విమానాశ్రయంలో దిగిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు.

ఎదురేగిన పన్నీరు సెల్వం
ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర రావు చెన్నైలో అడుగు పెట్టగానే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఎదురేగి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రాజ్ భవన్ చేరుకున్నారు. పన్నీరుకు సాయంత్రం ఐదు గంటలకు, శశికళకు రాత్రి ఏడు గంటలకు అపాయింటుమెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

గవర్నర్ ఎదుట నాలుగు ఆప్షన్లు
ప్రస్తుతం గవర్నర్ ఎదుట నాలుగు ఆప్షన్లు ఉన్నాయి. శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీరు సెల్వానికి బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించండ. ఆయన ఏం చేస్తారనే దానిపై ఆసక్తికరంగా ఉంది.

దీప వర్గీయుల ఆందోళన
శశికళకు మొదటి నుంచి చుక్కలు చూపిస్తున్న జయలలిత కోడలు దీపా జయకుమార్.. తనకు కూడా గవర్నర్ అపాయింటుమెంట్ కావాలని ఆమె కోరారు. ఈ మేరకు దీప వర్గీయులు రాజ్ భవన్ ఎదుట నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పన్నీరుకు బీజేపీ మద్దతు
తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ యూనిట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు మద్దతుగా నిలిచింది. ఆయన గత రెండు నెలలుగా ముఖ్యమంత్రిగా చాలా సమర్థంగా వ్యవహరించారని భాజపా తమిళనాడు యూనిట్ అధ్యక్షురాలు తమిలిసాయి సౌందరరాజన్ విలేకరులకు తెలిపారు.

శశికళకు బీజేపీ ఝలక్
అధికారం కోసం పార్టీ నాయకత్వం గందరగోళం సృష్టిస్తోందని శశికళను ఉద్దేశించి పరోక్షంగా సౌందర రాజన్ వ్యాఖ్యానించారు. పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారని, వర్ద తుపాను, జల్లికట్టు విషయాల్లో పరిస్థితులను సరైన పద్ధతిలో చక్కదిద్దారన్నారన్నారు. ఆయనకు ప్రజల మద్దతు కూడా ఉందన్నారు.

గవర్నర్ మంచి పని చేశారు
గవర్నర్ విద్యాసాగర్ రావు త్వరగా చెన్నైకి రాకుండా మంచి పనిచేశారని సౌందరరాజన్ అన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పేరును ప్రస్తావించకుండా.. పన్నీర్‌సెల్వం స్థానంలో పదవి పొందడానికి కొందరు గందరగోళం సృష్టిస్తున్నారన్నారు.

శశికళకు ఎందుకంత తొందర
ఒక రాష్ట్ర పార్టీగా ప్రశ్నిస్తున్నామని, ఎందుకంత తొందర అని సౌందరరాజన్ నిలదీశారు. ప్రజల మద్దతు పన్నీర్‌సెల్వంకే ఉందని, కానీ దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యంలో అంకెలే మాట్లాడతాయన్నారు. బీజేపీ తమిళనాడు ప్రజల వెంట ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications