కిలోన్నర గోల్డ్ అక్రమ రవాణా: ఎయిరిండియా ఉద్యోగి అరెస్ట్, సస్పెండ్
విమానాల్లో బంగారం అక్రమ రవాణా చేస్తూ కొందరు పట్టుబడటం చూస్తూనే ఉంటాం.. కానీ, ఇక్కడ మాత్రం ఏకంగా విమాన సిబ్బందే గోల్డ్ అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు.
కొచ్చి: విమానాల్లో బంగారం అక్రమ రవాణా చేస్తూ కొందరు పట్టుబడటం చూస్తూనే ఉంటాం.. కానీ, ఇక్కడ మాత్రం ఏకంగా విమాన సిబ్బందే గోల్డ్ అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ ఉద్యోగి దాదాపు కిలోన్నర బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కాడు. ఆ బంగారాన్ని తన చేతులకు చుట్టుకుని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, అధికారులు అతడ్ని పట్టుకుని.. బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బహ్రెయిన్ నుంచి కోజికోడ్ మీదుగా ఓ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్(Air India) విమానం కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆ విమానంలో కేబిన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న షఫీ అనే వ్యక్తి.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్‌కు రహస్య సమాచారం అందింది.

ఈ క్రమంలో కస్టమ్స్అధికారులు షఫీపై నిఘా పెట్టారు. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి హడావుడిగా వెళ్తున్న షఫీని పట్టుకుని తనిఖీ చేయగా.. స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. పేస్ట్ రూపంలో ఉన్న 1487 గ్రాముల బంగారాన్ని షఫీ తన రెండు చేతులకు చుట్టుకున్నాడు. అది బయటకు కనిపించకుండా స్లీవ్స్ ను కప్పి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆ బంగారం విలువ దాదా రూ. 75 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ స్పందించింది. బంగారం స్మగ్లింగ్ కు పాల్పడిన ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను తమ సంస్థ ఎప్పుడూ ఉపేక్షించదని స్పష్టం చేసింది. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అవసరమైతే విధుల నుంచి పూర్తిగా తొలగించేస్తామని తెలిపింది. షఫీ.. కేరళలోని వయనాడ్ వాసి.












Click it and Unblock the Notifications