అజిత్ సంచలన వ్యాఖ్యలు. మార్పు అవసరం లేదా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ స్టార్ హీరో అజిత్ కుమార్ చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఒక చిన్న కామెంట్, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హీట్ పెంచింది. ఆయన అధికార పార్టీకి మద్దతు ఇచ్చారా? లేక మార్పును కోరుకోవడం లేదా? అన్న చర్చ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గురువారం ఉదయం 6:50 గంటలకే తిరువాన్మియూర్‌లోని పోలింగ్ కేంద్రానికి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అజిత్ చేరుకున్నారు. తెల్లటి కోటు, నలుపు కళ్ళజోడుతో క్లాస్ లుక్‌లో వచ్చిన తన అభిమాన నటుడిని చూడగానే ఫ్యాన్స్ 'తలైవా.. తలైవా..' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఓటు వేసి బయటకు వస్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ గందరగోళం భరించలేక అజిత్ తన రెండు చెవులను చేతులతో మూసుకుని మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించారు.

ఒక్క మాట.. పెరిగిన పొలిటికల్ హీట్!
అయితే, అజిత్ ఓటు వేసి వస్తున్న సమయంలో ఒక ప్రైవేట్ ఛానెల్ విలేకరి "రాష్ట్రంలో మార్పు అవసరమా?" అని ప్రశ్నించారు. దానికి అజిత్ 'నో నీడ్' (అవసరం లేదు) అని సమాధానం ఇచ్చినట్లు వార్తలు దావాగ్నంలా వ్యాపించాయి. ఈ మాటను అధికార డీఎంకే వర్గాలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయి. ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ కూడా ఈ వ్యాఖ్యలను స్వాగతించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో, అజిత్ అధికార పార్టీకి మద్దతు ప్రకటించేశారని అంతా ఫిక్స్ అయిపోయారు.
ట్విస్ట్ ఇచ్చిన మేనేజర్.. అసలు జరిగింది ఇది!
ఈ వార్తలు రాజకీయ దుమారం రేపుతున్న తరుణంలో అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర రంగంలోకి దిగి అసలు క్లారిటీ ఇచ్చారు. "అజిత్ కుమార్ 'మార్పు అవసరం లేదు' అని రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. విలేకరి అడిగిన ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. తనకు ఇప్పుడు 'ఇంటర్వ్యూ అవసరం లేదు' (No need for interview) అన్న ఉద్దేశంతో 'నో నీడ్' అన్నారు తప్ప, అది రాజకీయాల గురించి కాదు" అని స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ ఛానెల్ తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేయడంతోనే ఈ గందరగోళం తలెత్తిందని ఆయన వివరణ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో సెలబ్రిటీలు చేసే చిన్న సైగ కూడా ఓటర్లపై ప్రభావం చూపుతుంది. అందుకే అజిత్ చెప్పిన ఆ 'నో నీడ్' అనే మాటను పొలిటికల్ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాయి. ఏదేమైనా అజిత్ క్లారిటీతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.














Click it and Unblock the Notifications