జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ ! తేల్చేసిన అమిత్ షా.. !
జమ్మూ కాశ్మీర్ లో ఈ నెల, వచ్చే నెలలో మూడు విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టికల్ 370 రద్దుపై స్పందించారు. అలాగే ఆర్టికల్ 370 పునరుద్ధరణపై వస్తున్న డిమాండ్లపైనా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కశ్మీర్ విషయంలో బీజేపీ వైఖరి తేటతెల్లం అయినట్లయింది.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా ఆర్టికల్ 370 ఇక చరిత్రలో కలిసిపోయినట్లేనని తేల్చిచెప్పేశారు. దాన్ని పునరుద్ధరించే అవకాశం లేదన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు జరిగే ప్రయత్నాలను తాము కచ్చితంగా అడ్డుకుంటామన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఇందులో ఇదే ప్రధాన అజెండా అయ్యే అవకాశాలు ఉన్నాయి.అయినా బీజేపీ మాత్రం ఆర్టికల్ 370 రద్దుకు కట్టుబడి ఉంటుందని అమిత్ షా తేల్చేయడం విశేషం.

2014 వరకు జమ్మూ కాశ్మీర్‌లో వేర్పాటువాదం, ఉగ్రవాదం నీడలు ఉన్నాయని, వివిధ రాష్ట్ర, రాష్ట్రేతర నాయకులు దానిని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని అమిత్ షా ఆరోపించారు. అలాగే ప్రభుత్వాలు కూడా బుజ్జగించే విధానాన్ని అవలంబించాయన్నారు. కానీ భారతదేశం, జమ్మూ కాశ్మీర్ చరిత్ర రాసినప్పుడల్లా 2014, 2024 మధ్య సంవత్సరాలు జమ్మూ కశ్మీర్ కోసం బంగారు అక్షరాలతో రాయబడతాయని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications