• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఊరి కథ: ‘కరోనా పోయింది... కష్టాలు మిగిలాయి’

By BBC News తెలుగు
|

కరోనావైరస్ గ్రామాలు

ఆయన ఒక మధ్య తరగతి రైతు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. అయినా, జూలై మధ్యలో జ్వరం వచ్చింది. నాలుగు రోజుల తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఇంట్లో తన తల్లిదండ్రులు, చిన్న పిల్లలు ఉండటంతో ముందు జాగ్రత్తగా కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ని ఆశ్రయించారు. అక్కడ నాలుగు రోజులున్నారు. శ్వాస కోశ సమస్యలు తలెత్తాయని, ఆక్సీజన్ అవసరమని డాక్టర్లు సూచిండంతో జీజీహెచ్‌కి వెళ్లారు. కానీ ,అక్కడి ఆసుపత్రి పరిస్థితులను చూసి ఆందోళన చెంది వెంటనే అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. కాకినాడలో పెద్దగా గుర్తింపు కూడా లేని సాధారణ ఆసుపత్రిలో చేరారు. అయినా, అక్కడ ఆయనకు 11 రోజులకు రూ. 7.24లక్షల బిల్లు వేశారు. అప్పు చేసి దాన్ని ఆయన చెల్లించారు. కరోనా నుంచి కోలుకోగలిగినా, దాని ఫలితంగా వచ్చిన ఆర్థిక కష్టాల నుంచి తేరుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన.

తూర్పు గోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలంలోని నాగులాపల్లి గ్రామానికి చెందిన ఓ మధ్య తరగతి రైతు అనుభవం ఇది. ఆయన ఒక్కరే కాదు, గ్రామంలో ఇదే తరహాలో కోవిడ్ బాధితులుగా మారినవారు, ఆర్థిక సమస్యలతో సతమతవుతున్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు.

ప్రాణభయంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించిన తమను ఇప్పుడు ఆర్థికపరమైన చిక్కులు చుట్టుముడుతున్నాయని వాపోతున్నారు.

నాగులాపల్లి గ్రామ జనాభా సుమారు 8వేలు. అధికారిక లెక్కల ప్రకారం వారిలో 91 మందికి కరోనావైరస్ సోకింది.

ఒకరు మృతి చెందారని, మిగతా అందరూ కోలుకున్నారని గ్రామానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరుణ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

కానీ స్థానికులు చెబుతున్నవివరాలకు, అధికారిక లెక్కలకు పొంతన కుదరడం లేదు. బీబీసీ ఈ విషయంపై దృష్టి సారించింది.

కరోనావైరస్

దేశంలోనే అత్యధిక కేసులున్న జిల్లా

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల జాబితాలో ఏపీది ద్వితీయ స్థానం. ఇక రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదైన జిల్లా తూర్పు గోదావరే. ఈనెల 5వ తేదీ నాటి బులిటెన్ ప్రకారం జిల్లాలో 1.15 లక్షల కేసులు నమోదయ్యాయి.

పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా వైరస్ విస్తరించింది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, గోవా వంటి రాష్ట్రాల కన్నా తూర్పు గోదావరిలో ఉన్న కరోనా బాధితుల సంఖ్య ఎక్కువ.

లాక్ డౌన్ సడలింపులతో పెరిగిన కేసులు

నాగులాపల్లి గ్రామంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలులో ఉన్నంత కాలం కరోనా కేసులు నమోదు కాలేదు. దాంతో మే నెలాఖరు వరకూ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

అయితే ఉపాధి కోసం ఈ గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వ్యక్తులు తిరిగి రావడం ప్రారంభం కావడంతో మే నెలాఖరున తొలి కేసు నమోదయ్యింది. మొదటి బాధితుడు కూడా వలస వెళ్లి వచ్చిన వారే. ఆ తర్వాత జూన్‌లో క్రమంగా కేసులు పెరుగుతూ జూలై, ఆగస్టుల్లో తీవ్రమయ్యాయి. అధికారిక లెక్కలు 91 మందికి కరోనా సోకినట్లు చెబుతున్నా, అసలు బాధితుల సంఖ్య దీనికి మూడు రెట్లుపైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

"ప్రభుత్వం నిర్వహించే కరోనా పరీక్షల్లో ఎక్కువ మందికి చేయించుకునే అవకాశం ఉండేది కాదు. పైగా కొందరు కరోనా బాధితులమని ఎవరికీ తెలియకూడదని గోప్యత పాటించేందుకు ప్రయత్నించారు. ప్రైవేటు పరీక్షా కేంద్రాలను ఆశ్రయించారు. అందులోనూ ఎక్కువ మంది సీటీ స్కాన్ ద్వారా కరోనా నిర్ధారణ చేయించుకున్నారు. మొత్తంగా గ్రామంలో 300కుపైగా కేసులు నమోదయ్యాయి. కొన్ని కుటుంబాల్లో దాదాపు అందరూ కరోనా బారినపడ్డారు. అధికారిక లెక్కల్లో ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాలే లెక్కలోకి వచ్చాయి'' అని ఈ విషయంపై నాగులాపల్లి గ్రామవాసి ఆనంద్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ప్రైవేటుగా పరీక్షలు చేయించుకున్న వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని పీహెచ్‌సీ ఇన్ఛార్జ్ కూడా అంగీకరించారు.

నాగులాపల్లి

హోం ఐసోలేషన్‌లోనే అత్యధికులు

కరోనా సోకిన చాలామంది హోం ఐసోలేషన్‌లో ఉండేందుకే మొగ్గు చూపారు. నాగులాపల్లిలో చికిత్స నిమిత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లినవారి సంఖ్య 40లోపు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. వీరిలో పీహెచ్‌సీ ద్వారా ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులకు వెళ్లిన వారు 14 మంది ఉన్నారు. మరో 25 మంది వరకూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు.

కుటుంబంలో ఒకరికి కరోనా సోకి, మిగతావారు దాని బారిన పడ్డా, చాలా మంది ఆ విషయాన్ని బయటకురానీయకుండా చూసుకున్నారని స్థానికులు అంటున్నారు.

"కరోనా సోకినప్పటికీ చాలా మంది ధైర్యంగా ఉన్నారు. ఆసుపత్రికి వెళ్లకుండానే హోం ఐసోలేషన్‌లోనే ఉండిపోయారు. వైద్య సహాయం పొందుతూ సమస్యను అధిగమించారు. కొందరు భయంతోనూ, మరికొందరు ఇతర కారణాలతోనూ వైరస్ సోకిన విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు"అని ఇక్కడి మాజీ ఎంపీటీసీ చిరంజీవికుమార్ బీబీసీతో చెప్పారు.

'కూలీలను కరోనా తాకలేదు’

నాగులాపల్లిలో సాధారణ కూలీలకు కరోనా సోకిన దాఖలాలు లేవు. దాదాపుగా మధ్య తరగతి రైతులు, ఎగువ తరగతి కుటుంబాలకు చెందిన వారే కరోనా బారిన పడ్డారు. నిత్యం ఉపాధి హామీ పనులకు, ఇతర వ్యవసాయ పనులకు వెళుతున్నవారు ఈ బాధితుల్లో లేరు.

నాగులాపల్లి శివారు ఉప్పరగూడెంకి చెందిన ఓ గర్భిణి వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కరోనావైరస్ బారిన పడ్డారు.

మొత్తంగా సామాన్య కుటుంబీకులు పెద్దగా వైరస్ బారిన పడలేదని గ్రామ పంచాయతీ లెక్కలు చెబుతున్నాయి.

"ఉపాధి హామీ పనులు యథావిధిగా సాగాయి. ఆ తర్వాత వ్యవసాయ పనులు కూడా సక్రమంగానే సాగాయి. పనులకు వెళ్లి, వస్తున్న వారి కుటుంబాల్లో కరోనా ప్రభావం కనిపించలేదు. కొందరు మాత్రం నిత్యం వచ్చే వైరల్ జ్వరాలకు గురయ్యారు. వారు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా, ఒకటి రెండు రోజులకే మళ్లీ తమ పనులు తాము చేసుకున్నారు. కూలీ పనులకు వెళ్లేవారు, కష్టజీవుల కన్నా ఇంట్లో ఉండే వారిలోనే వైరస్ ప్రభావం ఎక్కువ కనిపించింది'' అని గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ టి సుబ్బిరెడ్డి బీబీసీతో అన్నారు.

కొత్త కష్టాలు మిగిల్చింది

కరోనా వ్యాపించిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన వారిలో చాలా మంది ఆర్థికంగా చితికిపోయారు. కొందరు అప్పుల్లో మునిగిపోయారు.

వ్యవసాయంపై ఆధారపడ్డవారు ఎక్కువగా ఉన్న కారణంగా గ్రామంలో ఎక్కువ మంది చిన్న ఇబ్బందులతోనే గట్టెక్కారు. సాధారణ వ్యాపారాలు చేసుకునే పలువురు నష్టాల పాలయ్యారు.

గ్రామంలోని కొన్ని కుటుంబాలపై మాత్రం కరోనా ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని స్థానికుడు భమిడపాటి దేవీ ప్రసాద్ అన్నారు.

"ఆందోళన పెంచేలా సాగిన ప్రచారం కొందరిని భయపెట్టింది. దాంతో వారి భయాన్ని సొమ్ము చేసుకునేలా కొన్ని ఆసుపత్రులు వ్యవహరించాయి. వైద్యమే లేని రోగానికి సాధారణ రైతుల నుంచి కూడా లక్షలు వసూలు చేయడంతో ఆయా కుటుంబాలు చితికిపోయాయి. అప్పులు తీర్చలేని పరిస్థితిని కూడా కొందరు ఎదుర్కొంటున్నారు" అని ఆయన చెప్పారు.

నాగులాపల్లి

ప్రభుత్వ సహాయం నామమాత్రమే..

తొలుత హోం ఐసోలేషన్‌లో ఉన్న వారందరికీ క్వారంటైన్ కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నాగులాపల్లి గ్రామంలో ఈ క్వారంటైన్ కిట్లు 10 మందికి లోపే అందుకున్నారు. మిగిలిన వారంతా సొంతంగా వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారికి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయినప్పుడు ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పిన రూ.2 వేలు కూడా గ్రామంలో ఎవరికీ అందలేదు. అటువంటి ఆదేశాలేవీ తమకు రాలేదని పీహెచ్‌సీ వైద్యులు, పంచాయతీ కార్యదర్శికి చెప్పారు.

ప్రభుత్వ లెక్కలు గ్రామంలో కరోనా మృతులు ఒకరేనని చెబుతున్నా, కరోనాతో నలుగురు మరణించారని గ్రామస్తులు చెబుతున్నారు. మరోవైపు ఆ ఒక్క మృతుడి కుటుంబానికి కూడా ప్రభుత్వం అంత్యక్రియల ఖర్చు కోసం చెల్లిస్తామని చెప్పిన రూ.15వేలు అందలేదు.

గ్రామంలో దాదాపుగా 1200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో 91 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వైద్య అధికారులు చెబుతున్నారు.

ఇటు గ్రామంలో 300 మంది వరకు వైరస్ బారిన పడ్డారని, వారిలో 99 శాతం మంది కోలుకున్నారని గ్రామస్తులు అంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి రెండో సారి కూడా కరోనావైరస్ బారిన పడ్డట్లు వాళ్లు చెప్పారు.

గ్రామంలోని కరోనా బాధితుల్లో 99శాతం మంది కోలుకోవడానికి... తాము తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలే కారణమని స్థానిక గ్రామ సచివాలయ అధికారులు, వైసీపీ నేతలు చెబుతున్నారు.

''ఇది రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాలోని ఒక గ్రామం పరిస్థితి. అధికార-అనధికార లెక్కల మధ్య తేడా ప్రజలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తోందన్న సంగతి నాగులాపల్లి అనుభవాన్ని గమనిస్తే అర్థం చేసుకోవచ్చు'' అని మాజీ వైద్యాధికారి పి.రామేశ్వరరావు బీబీసీతో అన్నారు.

''అన్ని చోట్లా ఇలాంటి పరిస్థితే ఉంది. ఒక్కసారిగా కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ లెక్కలకు, వాస్తవానికి పొంతన లేదు. ప్రభుత్వం ప్రకటించిన సహాయం కూడా దాదాపుగా అందించినట్టు కనిపించడం లేదు. ప్రభుత్వ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ కరోనా సమయంలో ప్రైవేటు ఆసుపత్రులను కట్టడి చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపించింది. ఫలితంగా అనేక కుటుంబాలు చితికిపోయాయి. ఆరోగ్య శ్రీ ప్రకటనలకే పరిమితం అయ్యింది. కరోనా సమయంలో ఆ పథకం ఉపయోగం లేకుండా పోయింది. ఈ అనుభవాల పాఠాలను భవిష్యత్తులో ఉపయోగించుకోవాలి. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పాత్ర పెరగాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Though Corona has vanished in that village of AP, Villagers plights continue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X