ఆంధ్రప్రదేశ్: వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు-ప్రెస్ రివ్యూ

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కీలకమలుపు తిరిగిందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

వివేకానంద రెడ్డిని హత్య చేసేందుకు వినియోగించిన మారణాయుధాల్ని ఓ కాలువలో పడేసినట్లు సీబీఐ గుర్తించింది.

ప్రస్తుతం కస్టడీలో ఉన్న సునీల్‌యాదవ్‌ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా మారణాయుధాల్ని వెలికితీసే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.

సీబీఐ అధికారులు సునీల్‌ యాదవ్‌ను శనివారం పులివెందులకు తీసుకెళ్లారు. ఆయుధాలు పడేసిన ప్రదేశాన్ని అతను సీబీఐ అధికారులకు చూపించాడు.

పారిశుద్ధ్య కార్మికుల్ని తెప్పించి... నీళ్లు తోడించి: కాలువలో నుంచి మారణాయుధాల్ని వెలికితీయడానికి పులివెందుల పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య కార్మికుల్ని సీబీఐ అధికారులు రప్పించారు.

8 అడుగుల వరకు లోతు ఉండటంతో కాలువలోని లక్ష లీటర్ల మురుగునీటిని యంత్రాలతో తోడారు. ఇంకా మూడు అడుగుల లోతున మురుగునీరు ఉండటంతో ఆదివారం కూడా తోడుతారు.

ఆదివారం మారణాయుధాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. వివేకా ఇంటినుంచి కాలువ వద్దకు వెళ్లేందుకు రెండు దారులున్నాయి.

ప్రధాన రహదారి మీదుగా వెళ్తే సీసీ కెమెరాలు ఉంటాయి. దాంతో నిందితులు కెమెరాలు లేని మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా సీబీఐ గుర్తించింది.

ఆయుధాల్ని పడేశాక సమీపంలోని రింగురోడ్డుపైకి వెళ్లి.. అటు నుంచి పరారైనట్లు నిర్ధారణకు వచ్చింది.

శనివారం వివేకా మాజీ డ్రైవరు దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, కడప రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ మోహన్‌రెడ్డిని సీబీఐ బృందాలు విచారించాయని ఈనాడు రాసింది.

త్రిపుర ముఖ్యమంత్రిపై హత్యాయత్నం

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌పై గుర్తుతెలియని హత్యాయత్నం జరిగిందని ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రచురించింది.

త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌ను కారుతో ఢీకొట్టేందుకు యత్నించగా త్రుటిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

గురువారం అగర్తలలో ఈ ఘటన జరిగింది. సాయంత్రం వాకింగ్‌కు వెళ్లేందుకు తన నివాసం నుంచి బయల్దేరుతుండగా ముగ్గురు దుండగులు కారులో సీఎం భద్రతా వలయాన్ని ఛేదించుకొని వచ్చారు.

భద్రతా సిబ్బంది కారును అడ్డుకొనేందుకు యత్నించినా లాభం లేకపోయింది. కారును గమనించిన ముఖ్యమంత్రి వెంటనే పక్కకు జరిగి తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు.

అనంతరం ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకొని అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని వెల్లడించారు. శుక్రవారం కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

జాన్సన్ అండ్ జాన్సన్ టీకా

జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు అత్యవసర అనుమతి

జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులు ఇచ్చినట్లు సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

దేశవ్యాప్తంగా కోవిడ్‌ కట్టడికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పూత్నిక్‌-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.

మరికొన్ని రోజుల్లో మరో వ్యాక్సిన్‌ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా జాన్సన్‌ అండ్ జాన్సన్ సింగిల్‌ డోస్ వ్యాక్సిన్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది.

టీకాను అత్యవసర వినియోగానికి వాడవచ్చునని కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనాబారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలకు సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది.

అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమ‌తి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసింది.

ఈ సంస్థ 'జాన్సన్' పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది. తమ వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌తోనే కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారని సాక్షి రాసింది.

సచివాలయం త్వరగా పూర్తి చేయాలి-సీఎం కేసీఆర్

హైదరాబాద్‌లో నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని నమస్తే తెలంగాణ వార్తా కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌లో జరుగుతున్న సచివాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఏజెన్సీ ప్రతినిధులను, అధికారులను సీఎం ఆదేశించారు.

శనివారం సచివాలయ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. కాలినడకన నలుమూలలా కలియదిరిగి పరిశీలించారు. అనంతరం సమీక్ష నిర్వహించి పలు సూచనలుచేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడేండ్ల తెలంగాణలో సాగుతున్న ఆదర్శవంతమైన పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉండే సెక్రటేరియట్‌ నిర్మాణకౌశలం మన పాలనారీతులకు అద్దం పట్టేవిధంగా, గౌరవం ఉట్టిపడేలా ఉండాలని సీఎం అన్నారు.

తెలంగాణ ఏర్పాటు అనంతర పరిస్థితుల్లో, సిబ్బంది మరింత ప్రశాంతంగా తమ విధులను నిర్వహించుకొనే విధంగా సచివాలయం ఉండబోతున్నదన్నారు.

ప్రజలవద్దకే నేరుగా పాలనాఫలాలు చేరుకొంటున్న ప్రస్తుత తరుణంలో అందుకు అనుగుణంగానే నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తూ వేగంగా పూర్తిచేయాలని సీఎం అన్నారు.

దివ్యాంగులు, వయోవృద్ధులు తదితర సందర్శకులు, సెక్రటేరియట్‌కు వచ్చే వీఐపీల కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను సీఎం వివరించారు. అవసరమైన వారికోసం బ్యాటరీతో నడిచే వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+