వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌: జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన జీవోల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టే ప్రక్రియను ఆపేయాలని చెప్పింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇది ప్రజలకు సమాచారం అందకుండా చేసే విధానం అంటూ విమర్శలు చేస్తున్నాయి.

కానీ ప్రభుత్వం మాత్రం వాటిని తోసిపుచ్చుతోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తాము పాటిస్తున్నామని చెబుతోంది.

జీవోఐఆర్ అంటే ఏమిటి? ఎందుకొచ్చింది?

దేశంలో 2012లో నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసబుల్ పాలసీ అమలులోకి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, కార్యకలాపాలు ప్రజలందరికీ చేర్చేందుకు సాంకేతిక సదుపాయాలను వినియోగించుకోవాలని నిర్దేశించింది.

దానికి ముందే 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ (జీవోఐఆర్) అమలులోకి వచ్చింది.

2007లో ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా చొరవతో జీవోఐఆర్‌కి రూపకల్పన చేశారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులను అందరికీ అందుబాటులో ఉంచడం కోసం http://goir.ap.gov.in/ పేరుతో 2008 నాటికి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది.

ఇది దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం చూపిన చొరవ కావడంతో అనేక ప్రశంసలు కూడా వచ్చాయి. పారదర్శకతకు ఇది తోడ్పడుతుందనే అభిప్రాయం వినిపించింది.

రానురాను ఇంటర్ నెట్ వినియోగం పెరగడంతో ఇప్పుడు అనేక మంది ఈ వెబ్‌సైట్ ద్వారా జీవోల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం జీవోఐఆర్‌లో పాటిస్తున్న విధానాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అనుసరించాయి. కేంద్రం కూడా 2012లో దేశవ్యాప్త విధానం రూపొందించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సహా అన్ని ప్రధాన సంస్థలు తమ కార్యకలాపాల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచే విధానం అమలు చేస్తున్నాయి.

ఏపీ సచివాలయం

మళ్లీ వెనక్కి వెళ్తున్నట్టేనా?

జీవోలను విడుదల చేసే బాధ్యత సెక్షన్ ఆఫీసర్‌ది. దానిని పరిశీలించి, సంతకం చేసే అధికారం కార్యదర్శి, ఆపై స్థాయి అధికారికి ఉంటుంది. కానీ దానిని ప్రతి శాఖలోనూ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వద్ద ప్రారంభించి, సెక్షన్ ఆఫీసర్ రూపొందిస్తారు. దానిని పరిశీలన చేసేందుకు కార్యదర్శి నుంచి సంబంధిత శాఖ మంత్రి లేదా కొన్నిసార్లు సీఎం వరకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అందరూ పరిశీలించినప్పటికీ చివరకు కార్యదర్శి సంతకం చేసిన తర్వాత సెక్షన్ ఆఫీసర్ వద్దకే వస్తుంది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఆయా జీవోలను అప్‌లోడ్ చేస్తున్న క్రమంలో వరుస క్రమంలో నెంబర్ వచ్చేస్తోంది.

గతంలో దానికి భిన్నంగా ఉండేది. పరిశీలన పూర్తయిన తర్వాత కార్యదర్శి సంతకంతో అక్కడి నుంచి సెక్షన్ ఆఫీసర్‌కి నోట్ ఫైల్ సహా జీవో కాపీలు చేరేవి. దాని మీద నెంబర్ వేసి రిజిస్టర్‌లో నమోదుచేసే బాధ్యత సెక్షన్ ఆఫీసర్‌దే.

తేదీల వారీగా వాటిని నమోదు చేసి అవసరమైన సమయంలో వాటిని తీసుకోవడానికి రికార్డులు నిర్వహించేవారు. ఆన్‌లైన్ విధానం మొదలయిన తర్వాత ఈ నెంబరింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అంతా సిస్టమ్‌లోనే జరుగుతోంది.

ఇప్పుడు తాజా ఉత్తర్వులతో మళ్లీ పాత విధానం తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. సెక్షన్ ఆఫీసర్లంతా ఆయా శాఖలకు సంబంధించి జీవోల రిజిస్ట్రర్లు నిర్వహించాల్సి ఉంటుంది. 13 ఏళ్ల కిందటి పద్ధతి మళ్లీ ముందుకొస్తోంది.

జీవోఐఆర్లో ఏముంటుంది?

జీవోఐఆర్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అనేక వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక క్లిక్‌తోనే సమగ్ర సమాచారం తెలుసుకునే వెసులుబాటు దక్కింది. ఒక ఉద్యోగి సర్వీసుకు సంబంధించిన ఉత్తర్వుల నుంచి, అత్యున్నత అధికారుల బదిలీల వరకు ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ప్రజలకు చేరుతున్నాయి.

ప్రభుత్వ ఉత్తర్వులకు విధాన, రాజకీయ, ఆర్థిక పరమైన అనేక కారణాలుంటాయి. వాటిని జీవోల రూపంలో తీసుకురావడం బ్రిటీష్ హయాం నుంచి వస్తున్న ఆనవాయితీ.

జీవోలలో ప్రధానంగా మూడు రకాలుంటాయి. అందులో జీవో (ఎంఎస్) అంటే మాన్యువల్ స్క్రిప్ట్ అని, జీవో (పి) అంటే ప్రింటెడ్ అని, జీవో (ఆర్టీ) రొటీన్ కార్యకలాపాలకు సంబంధించిన జీవో అని వర్గీకరిస్తారు.

జీవో దేనికి సంబంధించిన అంశం అనేది కూడా పొందుపరుస్తారు. అది విధాన కొనసాగింపుగా వచ్చినా లేదా రద్దుకి సంబంధించిన అంశమయినా పేర్కొంటారు. సంబంధిత సెక్షన్ వివరాలు కూడా ఉంటాయి. ఆ జీవోకి సంబంధించి ఎంత మొత్తం నిధులు కేటాయించారనే అంశం ఉంటుంది. ఆ వివరాలన్నీ సులువుగా ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకుని పరిశీలించే వీలు కూడా ఉంది.

రహస్య, బ్లాంక్ జీవోలు ఎందుకొచ్చాయి?

జీవోలలో ప్రభుత్వం కొన్నింటిని కాన్ఫిడెన్షియల్‌గా పేర్కొంటుంది. వాటి వివరాలను ఓపెన్‌గా చెప్పకూడదని భావించినప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. శాంతి భద్రతలు, అంతర్గత భద్రతతోపాటు కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం 'కాన్ఫిడెన్షియల్‌'గా ఉంచడం ఆనవాయితీగా వస్తోంది.

2021 ఏప్రిల్ 1 నుంచి ఆగష్టు 15 వరకు సుమారుగా 6వేల జీవోలను వివిధ కేటగిరీలలో ప్రభుత్వం విడుదల చేసింది. అందులో 51 జీవోలను రహస్య జీవోలుగా పేర్కొంది. అందులో కొన్ని సర్వీస్ మాటర్స్, విజిలెన్స్‌కి సంబంధించిన అంశాలు కాగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి ఎక్కువగా రహస్య జీవోలు ఉన్నాయి.

రహస్య జీవోలను ప్రభుత్వాలు చాలాకాలంగా విడుదల చేస్తున్నాయి. 2014 - 2019 కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో 1729 జీవోలను 'కాన్ఫిడెన్షియల్‌'గా పేర్కొంది.

జగన్ ప్రభుత్వం మాత్రం ఇటీవల కాలంలో కొన్ని జీవోలను బ్లాంక్ అని పేర్కొంటోంది. గడిచిన రెండు నెలల కాలంలోనే ఇలాంటివి దాదాపు 50 వరకు ఉన్నాయి. జీవోఐఆర్‌లో వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అందులో ఏమీ ఉండదు. కొందరు ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించిన జీవోలను కూడా ఇలా బ్లాంక్ జీవోలని పేర్కొనడం ఆశ్చర్యకరంగా మారింది. వాటి మీద విమర్శలు కూడా వచ్చాయి.

'మేము ఫిర్యాదు చేయడం వల్లనే..'

"బ్లాంకు జీవోల విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. మా ఫిర్యాదు చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు. బహుశా ఆయన ప్రభుత్వాన్ని వివరణ కోరి ఉంటారు. దాంతో జగన్ చీకటిపాలనకు తెరలేపారు. ప్రభుత్వ నిధులు ఖర్చు చేసిన ప్రతీ వివరం ప్రజలకు చేరేలా ఉండాలనేది విధానం. కానీ ఈ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.

స్వయంగా తన తండ్రి హయంలో తీసుకొచ్చిన విధానానికి జగన్ తెరదించుతున్నారు. ఒకప్పుడు ఏపీ ప్రభుత్వ జీవోలన్నీ అందుబాటులో ఉంచుతున్న తీరు చూసి వివిధ రాష్ట్రాల వారు ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ విధానం మన దగ్గర నిలిపివేసేందుకు మెమో ఇవ్వడం సిగ్గుచేటు. అది కూడా స్వతంత్ర్యదినోత్సవం నాడు ఆదేశాలు వచ్చాయి. ఎఫ్ఐఆర్ కూడా ఆన్‌లైన్లో పెడుతున్నారు. ఇక వాటిని కూడా ఆపేస్తారా? పాదర్శకత అంటే ఇదేనా?" అని టీడీపీ నేత, ఉద్యోగుల సంఘ నాయకుడిగా పనిచేసిన పి. అశోక్ బాబు ప్రశ్నించారు.

జీవోఐఆర్ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వులు వెల్లడించే విధానానికి స్వస్తి పలుకుతున్న తీరుపై టీడీపీ తరుపున కేంద్రం దృష్టికి తీసుకెళతామని, సమాచార హక్కు కమిషనర్‌కి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

https://www.youtube.com/watch?v=onQsp1kfWB0

'సమాచార హక్కు తొలగించడమే'

ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులిస్తోంది? అందులోని మంచి, చెడు ఏమిటి? అనేది అందరికీ తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల గురించి బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు జీవోలను బహిరంగంగా వెల్లడించకూడదని తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేయాలి. అలాంటి నిర్ణయాలు అమలుకాకుండా చూడాలి. ప్రభుత్వ ఆదేశాల్లో "గోప్యత" పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి అనిరిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు.

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం మీద తాను సమాచార హక్కు కమిషనర్‌కి లేఖ రాసినట్టు ఆయన బీబీసీకి తెలిపారు.

కేసీఆర్

తెలంగాణాలోనూ వివాదం

తెలంగాణాలో కూడా రహస్య జీవోలపై పెద్ద దుమారం రేగింది.

2014 నుంచి 2019 వరకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలలో 40.76 శాతం జీవోలను రహస్యంగా పేర్కొనడంపై బీజేపీ నాయకుడు పేరాల శేఖర్ రావు హైకోర్టుని ఆశ్రయించారు.

ఆ సందర్భంగా జీవోలను రహస్యంగా ఉంచడం సరికాదని కోర్టు భావించింది. జీవోల గురించి ప్రజలకు తెలియాలని, వాటిని రహస్యంగా ఉంచడానికి వీల్లేదని కూడా తెలంగాణ హైకోర్టు సర్కారుకు స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వం మాత్రం సమాచార హక్కు చట్టం సెక్షన్ 4, 2012లో కేంద్రం విడుదల చేసిన డేటా పాలసీలో పేర్కొన్న పారదర్శకత, ఏడాది క్రితం తెలంగాణా హైకోర్టు తీర్పులను విస్మరిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. పైగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకుండా జీఏడీ పొలిటికల్‌ ఇన్‌చార్జి ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముత్యాలరాజు దీనిని జారీ చేయడం గమనార్హం.

ఇకపై పాత పద్ధతిలోనే జీవోలను విడుదల చేయాలని మెమోలో పేర్కొన్నారు. సెక్రటేరియేట్ మ్యానువల్ ప్రకారమే జీవోల విడుదల ఉండాలని ఆదేశించారు. ఇకపై జీవోలను నేరుగా జీవోఐఆర్‌లో పొందుపరిచే విధానానికి స్వస్తి పలకాలన్నారు. పోర్టల్‌లో జీవో పెట్టాలంటే దానికి సంబంధిత అధికారి అనుమతి అవసరమని తెలిపారు.

సెక్రటేరియేట్ మ్యానువల్ ప్రకారమే అని పేర్కొనడం ద్వారా ఆ మ్యానువల్ తయారుచేసిన నాటికి ఆన్‌లైన్ విధానం లేదు కాబట్టి మళ్లీ పాత పద్ధతిలో జీవోలు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది.

https://www.youtube.com/watch?v=t-jYqYQSBBw

ప్రజలకు సమస్య ఏమిటి?

ఇటీవల ప్రభుత్వ జీవోలు పదే పదే వివాదాస్పదం అవుతున్నాయి. జీవోలలో తప్పిదాలతో అభాసుపాలయిన ఘటనలు కూడా ఉన్నాయి. కొందరు ప్రభుత్వ జీవోల ఆధారంగా న్యాయస్థానాలను ఆశ్రయించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం కూడా అనుభవంలో ఉంది.

దాంతో అనేక సమస్యలకు కారణమవుతున్న జీవోలను బహిరంగపరిచే విధానానికి జగన్ ప్రభుత్వం ముగింపు పలికిందనే విమర్శ అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తోంది.

ప్రస్తుతం ఒక చోట మైనింగ్‌కి భూ కేటాయింపులు చేస్తూ జీవో విడుదల చేస్తుంది. దానిని తెలుసుకున్న సామాన్యులు తమకు అభ్యంతరాలుంటే న్యాయపరమైన చర్యలకు పూనుకోవచ్చు. ప్రభుత్వం ఒక పథకానికి కొన్ని నిధులు కేటాయిస్తుంది. అవి ఎంత అనేది పబ్లిక్ డొమైన్‌లో ఉన్న జీవో ద్వారా తెలిస్తే వెచ్చించిన మొత్తానికి, కేటాయించిన నిధులకు పొంతన లేకపోతే ప్రశ్నించ వీలవుతుంది. ఇక ప్రభుత్వం చేస్తున్న ఖర్చు సమంజసమైందా కాదా అనే విషయం కూడా ప్రజలు నిలదీయడానికి ఆస్కారం ఉంటుంది. అనేక విధాలుగా జీవోలలో సమాచారం ప్రజలకు చేరడం ద్వారా ప్రజా ప్రయోజనం నెరవేరుతుంది. దానికి అడ్డుకట్టవేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సమాచార హక్కు చట్టం కార్యకర్త, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు బీబీసీతో అన్నారు.

జీవోలు నేరుగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలంతా సంబంధిత కార్యాలయాలకు ఆర్టీఐలో పిటీషన్లు పెట్టుకోవాల్సి వస్తుందని, దాని వల్ల వాటిని క్లియర్ చేసేందుకు ప్రభుత్వానికి కూడా అదనపు భారం అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

వివాదంపై ప్రభుత్వం ఏమంటోంది?

తమ ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తుందని సీఎం జగన్ తన స్వతంత్ర్య దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు. కానీ అదే రోజు జీవోఐఆర్‌పై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

దీనిపై స్పందించేందుకు ప్రభుత్వ ప్రతినిధులు నిరాకరించగా, వైసీపీ నేతలు మాత్రం ఇందులో తప్పేం లేదని అంటున్నారు.

ఇది విధానపరమైన నిర్ణయం. జీవోల విషయంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న విధానమే ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. దానిని కూడా తప్పుబట్టడం విడ్డూరం. అభ్యంతరం అర్థరహితం. జీవోలతో సామాన్యులకు పెద్దగా అవసరం ఏముంటుంది. రాజకీయం చేయాలని చూసేవాళ్లకు ప్రతీది సమస్యే. ప్రభుత్వం అన్ని అంశాలు ప్రజల ముందు ఉంచుతోంది. రెండున్నరేళ్లుగా అవినీతి లేని పాలన అందిస్తోంది. నేరుగా ప్రజలకే మేలు కలిగే విధంగా పథకాలు అందిస్తోంది. వాటిని సహించలేనితనంతో చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో వందల రహస్య జీవోలు ఇచ్చిన వాళ్లే ఇప్పుడు జీవోల గురించి మాట్లాడడమే చిత్రంగా ఉంది అంటూ వైసీపీ అధికార ప్రతినిధి కే నాగార్జున వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Andhra Pradesh: Govt orders not to put GO's on official website
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X