దారి తప్పిన పార్టీ.. అందుకే అంతా పోతున్నారు
అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేడు తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించిన రాఘవ్ చద్దా సహా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఒకేసారి పార్టీని వీడి బీజేపీలో చేరడం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందిస్తూ ఆప్ నాయకత్వంపై నిప్పులు చెరిగారు.
మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడిన అన్నా హజారే, ఆప్ పతనాన్ని విశ్లేషించారు. "ఆమ్ ఆద్మీ పార్టీ గనుక సరైన మార్గంలో పయనించి ఉంటే, ఇంతమంది కీలక నేతలు పార్టీని వీడే పరిస్థితి వచ్చేది కాదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంటుందని, ఎంపీలు ఏదో ఒక బలమైన సమస్యను ఎదుర్కొని ఉండబట్టే బయటకు వెళ్లారని హజారే పేర్కొన్నారు. పార్టీ నాయకత్వ వైఖరి వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు.

ఒకేసారి ఏడుగురు ఎంపీలు 'జంప్'..
ఏప్రిల్ 25, 2026న ఆప్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాఘవ్ చద్దా నేతృత్వంలో అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్త, విక్రమ్ సాహ్ని, స్వాతి మాలివాల్ వంటి హేమాహేమీలు పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా అధికారికంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో విలీనమైనట్లు రాఘవ్ చద్దా ప్రకటించారు. రాజ్యసభలో ఆప్ బలం ఒక్కసారిగా పడిపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
'తప్పు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని'..
బీజేపీలో చేరుతున్న సందర్భంగా రాఘవ్ చద్దా చేసిన వ్యాఖ్యలు ఆప్ నాయకత్వానికి మింగుడుపడటం లేదు. "నా రక్తమాంసాలతో పోషించిన పార్టీ నేడు తన సిద్ధాంతాలు, విలువలు మరియు ప్రాథమిక నైతికతను వదిలేసింది. అది దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం పనిచేస్తోంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "కొన్నేళ్లుగా నేను తప్పు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని భావిస్తున్నాను" అని చద్దా అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఆప్ ఉనికికి అగ్నిపరీక్ష..
2012లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తితో కేజ్రీవాల్ స్థాపించిన ఈ పార్టీకి, తాజా పరిణామాలు భారీ ఎదురుదెబ్బగా పరిగణించబడుతున్నాయి. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నేతలు, చట్టసభ సభ్యులు నిష్క్రమించడంతో ఆప్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సిద్ధాంతాలను వదిలి వ్యక్తిగత ప్రయోజనాల వైపు మొగ్గు చూపడమే ఈ పతనానికి కారణమని అన్నా హజారే హెచ్చరికలు ఇప్పుడు పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి.














Click it and Unblock the Notifications