బీజేపీకి బిగ్ షాక్.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీనామా
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శుక్రవారం జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపించారు. తాను చీఫ్ రేసులో లేనని ప్రకటించారు. త్వరలోనే తమిళనాడు బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని తెలిపారు. బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా చేయడంపై తమిళనాట రాజకీయాలు ఉత్కంఠంగా మారాయి.

అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు అన్నాడీఎంకే పెట్టిన కండీషన్ కారణంగానే అన్నామలై.. బీజేపీ చీఫ్ పదవికి దూరంగా ఉంటున్నారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అధికార డీఎంకే పార్టీ భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈసారి తమిళనాడులో అడుగుపెట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇక తొలిసారే విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ప్రముఖ నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు.
అయితే తమిళనాడులో తాజా పరిణామాల నేపథ్యంలో.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయింది బీజేపీ. ఇటీవల అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి.. దిల్లీలోని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. అయితే బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు కోసమే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. తాను తదుపరి అధ్యక్షుడి రేసులో లేనని ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైను తప్పిస్తేనే తాము బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని పళనిస్వామి.. అమిత్ షాతో చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి అన్నామలైని దూరంగా ఉండాలని హైకమాండ్ ఇలా వ్యవహరించినట్లు కాషాయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications