జయలలిత ఆరోగ్యంపై ఆందోళన:, కరుణ స్పందన పోలీసులకు డీజీపీ ఆదేశాలు
ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆకాంక్షించారు. ఆమె త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
తమిళనాడు: ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆకాంక్షించారు. ఆమె త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కరుణానిధి చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జయ త్వరగా కోలుకోవాలని డిఎంకే నేత స్టాలిన్ కూడా ఆకాంక్షించారు.
కాగా, తమిళనాడులో పోలీసులు అందరినీ అత్యవసరంగా విధుల్లో చేరాలని డీజీపీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. వీరంతా వారి యూనిఫారంల్లో కేటాయించిన వాహనాల్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది. సెలవుల్లో ఉన్నవారు కూడా వెంటనే జాయిన్ కావాలన్నారు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ పర్సనల్, ఇతరులు ఆయా జిల్లాల్లోని ఎస్పీ లేదా కమిషనర్ కార్యాలయాల ఎదుట సోమవారం ఉదయం ఏడు గంటలకు రిపోర్ట్ చేయాలని డిజిపి ఆదేశించారు. ఫుల్ యూనిఫాంలో రావాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాల వరకు విధుల్లో ఉండాలన్నారు.

అభిమానులకు ఆందోళనకర సమయం
జయలలిత అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఇది మరింత ఆందోళన కలిగించే సమయం. ఆమెకు గుండెపోటు రావడంతో ఏమయిందోననే ఆందోళన అభిమానుల్లో కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రికి వచ్చారు. జయకు ఏమయిందో ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.
జయ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోడ్ల పైన కూడా జయ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరేమన్నారు?
తమిళనాడు సీఎం జయలలిత కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం ఆందోళనకు గురిచేసిందని, ఆమె వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు.
తమిళనాడు సీఎం జయలలిత వేగంగా కోలుకోవాలని మహారాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మహా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఆమె వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని, మనం ఆమె కోసం ప్రార్థనలు చేద్దామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
జయలలిత వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, ఆమె వేగంగా కోలుకుంటుందని ఆశిస్తున్నట్లు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
జయలలిత కార్డియాక్ అరెస్ట్‌కు గురికావడం విచారకరమని, ఆమె వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, బీరేంద్ర సింగ్‌లు అన్నారు. జయలలిత వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, 1974లో ఎవీఎం స్టూడియోలో ఎంజీఆర్‌ను, ఆమెను కలుసుకున్నానని, నాడు ఆమె చూపిన అభిమానం ఇప్పటికీ గుర్తుందని నటుడు రిషికపూర్ అన్నారు.












Click it and Unblock the Notifications