ఏపీ క్యాడర్ రిటైర్డ్ ఐఎఎస్‌కు కేంద్రం కీలక పదవి
UPSC Chairman: దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు కొత్త ఛైర్‌పర్సన్ అపాయింట్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారిణి ప్రీతి సూడాన్.. యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదివరకు ఈ హోదాలో పని చేసిన మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరున్న ఆయన.. పదవీకాలం ముగియడానికి అయిదు సంవత్సరాలకు ముందే ఈ అత్యున్నత హోదా నుంచి తప్పుకొన్నారు. స్వచ్ఛందంగా ఆయన వైదొలిగారు.

జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వ్యవహారం రోజురోజుకూ దుమారం రేపింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వయానా ఆమెపై కేసు నమోదు చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంది.
ఆ పరిస్థితుల్లో మనోజ్ సోనీ రాజీనామా చేశారు. 2029 వరకు ఆయన యూపీఎస్సీ ఛైర్మన్‌గా కొనసాగాల్సి ఉన్నప్పటికీ.. అయిదేళ్ల ముందే తప్పుకున్నారు. ఆయన రాజీనామాకు ఈ వివాదాలకు ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత కారణాల వల్ల నెల కిందటే ఆయన వైదొలిగారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.
మనోజ్ సోనీ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన యూపీఎస్సీ ఛైర్‌పర్సన్ స్థానంలో ప్రీతి సూడాన్ అపాయింట్ అయ్యారు. 1983 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎఎస్ అధికారిణి ఆమె. 2020 జులైలో రిటైర్డ్ అయ్యారు. రిటైర్ అయ్యే సమయానికి కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
అంతకుముందు కేంద్ర ఆహార- పౌరసరఫరాలు, మహిళా, శిశుసంక్షేమం, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పని చేశారు. జాతీయ వైద్య కమిషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కమిషన్, ఇ-సిగరెట్‌లపై నిషేధం వంటి చట్టాలకు రూపకల్పన చేశారు. బేటీ బచావో, బేటీ పఢావో, ఆయుష్మాన్ భారత్ పథకాలు ఆమె బ్రెయిన్ ఛైల్డ్‌గా చెబుతారు. వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్‌గా కూడా ప్రీతి సూడాన్ వ్యవహరించారు.












Click it and Unblock the Notifications