Exclusive: కాశ్మీర్ పై కేంద్రం ప్రతీకారం-అసలు కారణమిదే-వన్ ఇండియాతో ఫరూక్ అబ్దుల్లా..!
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జమ్మూకశ్మీర్ పై కేంద్రం ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు సహా కేంద్రం తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాన్ని ఆయన ప్రస్తావించారు. వన్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫరూక్ అబ్దుల్లా పలు సంచలన అంశాల్ని వెల్లడించారు. కాశ్మీర్ విషయంలో కేంద్రం ప్రతీకార ధోరణి వెనుక కారణాలను కూడా ఆయన బయటపెట్టారు.
జమ్మూకశ్మీర్ కు గతంలో ఉన్న ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 35ఏని రద్దు చేయడం ద్వారా ఇక్కడి ప్రజల హక్కుల్ని కేంద్రం హరించిందని ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. అందుకే బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో కలిసి కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోరాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు కేవలం రాజ్యాంగ సవరణలు మాత్రమే కాదని కాశ్మీర్ ఉనికి, గౌరవం, భవిష్యత్తుపై ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు. ఇక్కడి ప్రజలపై ప్రతీకారంలో భాగంగానే కేంద్రం వీటిని తొలగించిందన్నారు.

గతంలో రాజ్యసభలో కశ్మీర్ పై అప్పటి కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ రెండు రాష్ట్రాలను పోలుస్తూ మాట్లాడినప్పుడు కేంద్రం చేసిన ఎదురుదాడిని బట్టి చూస్తే ఈ రాష్ట్రం విషయంలో వారి ధోరణి అర్ధమవుతుందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. అప్పట్లో వివిధ రంగాల్లో జమ్మూకశ్మీర్ ఏ విధంగా ముందంజలో ఉందో ఆజాద్ వివరించారని అబ్దుల్లా గుర్తుచేశారు. ఇదే కేంద్ర నాయకత్వాన్ని చికాకు పెట్టిందని ఆరోపించారు.
ప్రస్తుతం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కేవలం బీజేపీ చర్యల్ని తిప్పికొట్టడం మాత్రమే కాదని, రాష్ట్ర ప్రగతి, అభివృద్ధికి హామీ ఇవ్వడం కూడా అని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ జమ్మూ కాశ్మీర్ ను కష్టాల్లోకి నెట్టడం మినహాయిస్తే ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. అందుకే ప్రజలు తమ హక్కులు తిరిగి పొందాలన్నా, న్యాయం, అభివృద్ధి జరగాలన్నా తమ కూటమి గెలుపు తప్పనిసరి అన్నారు. జమ్మూకశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా సాధించడం తమ ముందున్న కర్తవ్యం అన్నారు.












Click it and Unblock the Notifications