ఢిల్లీలో ఇక ఆక్సిజన్ హోం డెలివరీ- కాన్‌సన్‌ట్రేటర్ బ్యాంక్‌లు-కేజ్రివాల్ ప్రకటన
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో రాజధాని ఢిల్లీపైనా ఆ ప్రభావం పడుతోంది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో జనం అల్లాడుతున్నా్రు. ఆక్సిజన్ సిలెండర్ల కొరతతో జనం ఇంటివద్దే ఉండి వైద్యం తీసుకోవాలన్నా కుదరని పరిస్ధితి. దీంతో కేజ్రివాల్ సర్కారు తాజాగా ఆక్సిజన్‌ను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు ప్రకటించింది.
ఢిల్లీ పరిధిలోని జిల్లాల్లో ఆక్సిజన్ సరఫరాను మెరుగుపర్చేందుకు సీఎం అరవింద్ కేజ్రివాల్ ఇవాళ కొన్ని కీలక చర్యలు ప్రకటించారు. ఇందులో జిల్లాకో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ బ్యాంక్ ఏర్పాటుతో పాటు ఆక్సిజన్ హోం డెలివరీ కూడా చేస్తామని ప్రకటించారు. ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేసే ఆక్సిజన్ బ్యాంక్‌లో 200 కాన్‌సన్‌ట్రేటర్లను అందుబాటులో ఉంచుతామని కేజ్రివాల్ వెల్లడించారు. స్ధానికంగా ఉన్నఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం చేరే రోగులకు ఇవి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

అలాగే ఢిల్లీలో ఇళ్లలోనే ఉండి హోం ఐసోలేషన్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్న రోగుల కోసం ఇళ్ల వద్దకే ఆక్సిజన్ పంపాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆక్సిజన్ సిలెండర్ కోసం ఆర్డర్ పెడితే రెండు గంటల్లోనే ఇంటి వద్దకే తమ సిబ్బంది చేరవేస్తారని కేజ్రివాల్ ప్రకటించారు. ఇలా ఇంటికి వచ్చే టీమ్‌లో సాంకేతిక అంశాలు తెలిసిన వ్యక్తుల్ని పంపుతామని కేజ్రివాల్ తెలిపారు. తాజా చర్యలతో ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీరడంతో పాటు ఆస్పత్రులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications