Assembly poll results 2024: అరుణాచల్ లో బీజేపీ హ్యాట్రిక్-సిక్కింలో ఎస్కేఎందే అధికారం..!
ఇవాళ ప్రకటించిన ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీలనే ఓటర్లు మరోసారి ఆదరించారు. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం)కే మరోసారి ప్రజలు అధికారం అప్పగించారు. ఏప్రిల్ 19న జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల ఓట్లను ఇవాళ లెక్కించారు. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ 60 సీట్లకు గానూ 46 సీట్లలో గెలిచింది. సిక్కింలో అధికార ఎస్కేఎంకు 32 సీట్లకు గానూ ఏకంగా 31 సీట్లు దక్కాయి. పూర్తిగా స్థానిక అంశాల ప్రాతిపదికనే ఈ ఎన్నికలు జరిగాయి.
అరుణాచల్ ప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం దిశగా సాధించింది. ఏప్రిల్ 19న జరిగిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం చేపట్టారు. ఇందులో 60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఘన విజయం సాధించింది. ఎన్నికలకు ముందే 10 మంది బీజేపీ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. ఇందులో సీఎం పెమా ఖండూతో మరికొందరు సీనియర్లు ఉన్నారు. మిగిలిన 50 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 36 మంది బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. విపక్ష ఎన్పీపీకి 5, కాంగ్రెస్ కు 1, ఇతరులకు 8 సీట్లు దక్కాయి.

ఈశాన్యంలో మరో చిన్న రాష్ట్రం సిక్కిం అసెంబ్లీకి ఏప్రిల్ 19న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. మొత్తం 32 సీట్లు ఉన్న సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 31 సీట్లలో అధికార సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) గెలుపొందింది. మరో సీటులో మాత్రం విపక్ష ఎస్డీఎఫ్ గెలిచింది. దీంతో ఇప్పటికే మెజార్టీకి అవసరమైన 17 సీట్లు దాటేసిన ఎస్కేఎం మరోసారి అధికారం చేపట్టబోతోంది. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీ చేసినా ఒక్క సీటులోనూ గెలవలేదు.












Click it and Unblock the Notifications