News makers: హిందువులకు గిఫ్ట్ గా రామజన్మభూమి: వయస్సు మీద పడ్డా..పదును తగ్గని గళం: పరాశరన్..!
న్యూఢిల్లీ: కే పరాశరన్. ప్రస్తుతం దేశంలో మారుమోగిపోతున్న పేరు. చారిత్రాత్మకమైన అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడిన తరువాత వెలుగులోకి వచ్చిన పేరు. హిందువులకు రామజన్మభూమి స్థలాన్ని బహుమతిగా దక్కడంలో కీలక పాత్ర పోషించిన న్యాయకోవిదుడు. హిందూ సంఘాల తరఫున దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలను వినిపించిన సీనియర్ అడ్వొకేట్. తన కేరీర్ మొత్తంలో చిరస్మరణీయమైన కేసును ఆయన వాదించి, విజయం సాధించారు.

93 సంవత్సరాల వయస్సులో ఏకధాటిగా..
పరాశరన్ వయస్సు 93 సంవత్సరాలు. 40 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో ఒక్క రోజు కూడా విచారణకు గైర్హాజర్ కాలేదంటే ఆయన ఎంత చిత్తశుద్ధితో ఈ కేసును విచారించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సారథ్యంలో అయోధ్య కేసును విచారించిన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందు.. పరాశరన్ ఏకధాటిగా తన వాదనలను వినిపించారు.

పద్మ పురస్కారాల గ్రహీతగా..
తమిళనాడులోని శ్రీరంగంలో 1927లో పరాశరన్ జన్మించారు. మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో ఆయన సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ గా పనిచేశారు. 2003లో పద్మభూషణ్, 2011లో పద్మ విభూషణ్ పౌర పురస్కారాలను అందుకున్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు. అక్కడా న్యాయ వ్యవస్థ కోసం గళమెత్తారు. ప్రభుత్వ పొరపాట్లు, తప్పొప్పులను నిరభ్యంతరంగా ఎత్తి చూపించారు.

రామ్ లల్లా తరఫు న్యాయవాదిగా..
రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించిన కేసులో పరాశరన్.. రామ్ లల్లా విరాజమాన్ తరఫున వాదనలను వినిపించారు. కీలకమైన పాయింట్లను లేవనెత్తారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే శ్రీరాముడు జన్మించాడనటానికి వారి భక్తి, విశ్వాసాలే సాక్ష్యాధారాలని వాదించారు. లక్షల సంవత్సరాలు గడిచిపోయిన తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే జన్మించాడనటానికి లిఖితపూరకమైన, చారిత్రక సాక్ష్యాధారాలను ఎక్కడి నుంచి తీసుకుని రాగలమని ఆయన ధర్మాసనం ముందు తన వాదనలను వినిపించారు.

సీనియర్ అడ్వొకేట్లు సైతం జూనియర్లుగా..
హిందువుల పరమ పవిత్రంగా భావించే వాల్మీకి రామాయణంలో చాలా చోట్ల అయోధ్య ప్రస్తావన ఉందని చెప్పారు. అంతకంటే ఇంకేమి సాక్ష్యాధారాలు కావాలని, రామజన్మభూమి శ్రీరామచంద్రుడికి ప్రతిరూపంగా మారిందని పరాశరన్ ధర్మాసనం ముందు వాదించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సీనియర్ అడ్వొకేట్లు సైతం ఆ కేసులో పరాశరన్ కు అసిస్టెంట్లుగా పనిచేశారు. పీవీ యోగేశ్వరన్, అనిరుధ్ శర్మ, శ్రీధర్, ఆదితి, అశ్విన్ కుమార్, భక్తి వర్ధన్ సింగ్ వంటి లాయర్లు పరాశరన్ కు సహకరించారు.

అనారోగ్యానికి గురైనా..
తోటి సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధవన్ ఆయనకు ప్రధాన ప్రత్యర్థి. ముస్లిం పార్టీల తరఫున రాజీవ్ ధవన్ వాదించిన విషయం తెలిసిందే. వాదోపవాదాల సమయంలో రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పటి.. పరాశరన్ తన వాదనల నుంచి పక్కకు మళ్లలేదు. తాను చెప్పదలచుకున్నది ముక్కుసూటిగా స్పష్టం చేశారు. 40 రోజుల పాటు కొనసాగిన విచారణలో కొన్ని సందర్భాల్లో అనారోగ్యానికి గురైనప్పటికీ.. ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా వాదనలను వినిపించారు.












Click it and Unblock the Notifications