జనవరి 22న బ్యాంకులకు సెలవు ఉందా? ప్రైవేటు బ్యాంకులు పని చేస్తాయా? ఆర్బీఐ క్లారిటీ
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొక్క రోజే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలంలో అపురూపమైన రామమందిరం నిర్మితమైంది.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య సిద్ధమైంది. అయోధ్యాపురి మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలన్నింటినీ కూడా విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలు హాఫ్ డే సెలవును ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, గుజరాత్, మణిపూర్, అస్సాం, హర్యానా రాష్ట్రాలు హాఫ్ డే సెలవును మంజూరు చేశాయి.
ఆయా రాష్ట్రాల్లోని అన్ని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలన్నీ కూడా మధ్యాహ్నం వరకు మూతపడతాయి. భోజన విరామం అనంతరం మళ్లీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తాయి.
ఈ క్రమంలో బ్యాంకులకు కూడా సెలవు వర్తిస్తుందా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. దేశంలోని అన్ని జాతీయ బ్యాంకులకు కూడా జనవరి 22వ తేదీన అంటే.. సోమవారం నాడు మధ్యాహ్నం 2:30 వరకు సెలవు ఉంటుందని ప్రకటించింది. 2:30 గంటల తరువాత అవి కార్యకలాపాలు ఆరంభిస్తాయని తెలిపింది.

జాతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులన్నింటికీ ఈ సెలవును వర్తింపజేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ కింద ఈ సెలవును ప్రకటించినట్లు వెల్లడించింది.
ప్రైవేటు బ్యాంకులు కూడా సెలవును ప్రకటించాయి. పలు రాష్ట్రాల్లో హాఫ్ డే హాలిడేను పాటించనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అన్ని ప్రైవేటు బ్యాంకులకు సోమవారం నాడు సెలవు ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు సోమవారం రోజు మొత్తం పని చేయవు.












Click it and Unblock the Notifications