'మీరు కోలుకుని ఇంటికి వస్తుండటం సంతోషంగా ఉంది' 42 రోజుల క్రితం మరణించిన పోలీసుకు ఆయుష్మాన్ భారత్ మెసేజ్!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య హామీ పథకంగా 'ఆయుష్మాన్ భారత్' పేరుగాంచింది. ఈ పథకం కింద అర్హత కలిగిన ఒక్కో పేద కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ జరుగుతుంది. అయితే ఈ భారీ పథకంలో లుకలుకలు కూడా చాలానే ఉన్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్ గఢ్ లో వెలుగు చూసిన ఘటనే నిదర్శనం అని చెప్పొచ్చు. 42 రోజుల క్రితం మృతి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ సెల్ కు షాకింగ్ మెసేజ్ వచ్చింది. 'మీరు కోలుకుంటున్నందుకు సంతోషం'.. అని ఆయుష్మాన్ భారత్ నుంచి మెసేజ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెంది 42 రోజులు గడిచినా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా రికార్డుల్లో మాత్రం ఇంకా కోలుకుంటున్నట్లు గానే రికార్డు కావడం కలకలం రేపుతోంది. ఎప్పుడో అంత్యక్రియలు నిర్వహించి.. డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకుంది మృతుడి భార్య. అయితే తాజాగా ఈ మెసేజ్ చూసి ఆమె ఒక్కసారిగా కంగుతింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సూర్గుజా జిల్లాలోని అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో కానిస్టేబుల్ దేవ్ నారాయణ్ రామ్ జూన్ 26 వ తేదీన అనారోగ్యంతో చేరాడు. అయితే జూన్ 30 న మృతి చెందాడు. ఆయన మరణించిన 42 రోజుల తర్వాత 'దేవ్ నారాయణ్ రామ్ గారూ.. మీరు కోలుకుని ఇంటికి వస్తుండటం మాకు సంతోషంగా ఉంది' అంటూ మెసేజ్ రావడంతో ఆయుష్మాన్ భారత్ రికార్డుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనపై మృతుడి భార్య సీమా కుజుర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తానూ ఒక ఆస్పత్రిలో ఉద్యోగినిగా పనిచేస్తున్నానని.. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై అంబికాపూర్ మెడికల్ ఆసుపత్రి డాక్టర్ శైలేంద్ర గుప్తా స్పందించారు. బాధ్యుడైన డేటా ఎంట్రీ ఆపరేటర్ ను ఆయుష్మాన్ కార్డ్ విధులనుంచి తొలగించినట్లు తెలిపారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications