తూచ్.. నేనలా అనలేదు.. ప్రధాని పదవి వ్యాఖ్యలపై ఆజాద్ యూటర్న్..
ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట మార్చారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని, ప్రధాని పదవిపై కాంగ్రెస్‌కు ఆశలేదన్న వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే దేశంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని అన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు జరగాలని ఆజాద్ పరోక్షంగా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు ప్రధాని పదవిపై ఆసక్తిలేదన్న దాంట్లో నిజం లేదు. 'దేశంలో సుదీర్ఘ చరిత్రగల అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలి. అయితే ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధాని పదవి కోసం ఘర్షణ పడటం సరికాదంటున్నాను. చర్చల ద్వారానే ఈ అంశాన్ని పరిష్కరించుకోవాల'ని అన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందన్నార ఆజాద్. ఈసారి 273 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. మెజార్టీ సాధించడం కాంగ్రెస్‌కు పెద్ద లక్ష్యం కాదని స్పష్టం చేశారు
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యం తప్ప.. పీఎం పదవిపై కాంగ్రెస్‌కు పెద్దగా ఆశలేదని ఆజాద్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలు కలిసి కట్టుగా నిర్ణయం తీసుకుంటేనే కూటమికి నేతృత్వం వహించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. బీజేపీయేతర పార్టీల సమిష్టి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆజాద్ స్పష్టం చేశారు. తాజాగా మాటమార్చిన 273 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, అందుకే తమకే ప్రధాని పదవి ఇవ్వాలని చెప్పడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications